Vijay Devarakonda: బాలీవుడ్.. బడా ప్రొడక్షన్ హౌస్‌లో రౌడీ స్టార్!
ABN, Publish Date - May 29 , 2026 | 10:51 AM
గీత గోవిందం సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. అర్జున్ రెడ్డి చిత్రంతో రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయిన ఈ యంగ్ హీరో, గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.
గతేడాది వచ్చిన కింగ్‌డమ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. బాలీవుడ్ మార్కెట్‌లో రౌడీ స్టార్‌కి ఒక మంచి పునాది వేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి, రౌడీ జనార్దన లాంటి విభిన్నమైన చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో ఎలాగైనా సరే గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే, సరిగ్గా ఇక్కడే ఒక నయా అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అదేంటంటే.. విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఒక బడా ప్రొడక్షన్ హౌస్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ మరేదో కాదు... ప్రస్తుతం హిందీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ డాక్ ఫిల్మ్స్’ (Maddock Films). ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ పేరు మారుమోగిపోతోంది.
హారర్-కామెడీ యూనివర్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సంస్థ.. స్త్రీ సిరీస్, ముంజ్యా, అటు హిస్టారికల్ డ్రామాగా వచ్చిన ఛావా (Chhaava), థామా (Thamma) వంటి భారీ చిత్రాలతో టాప్ పొజిషన్‌లో దూసుకెళ్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడంలో ఈ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.
అలాంటి ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో మన రౌడీ స్టార్ కనిపించడంతో.. బాలీవుడ్‌లో ఏదో పెద్ద ప్లానే జరుగుతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే.. ఈ మీటింగ్‌లో విజయ్ దేవరకొండ ఒక్కడే లేడు. టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ (Vikram K Kumar) కూడా అక్కడ కనిపించడం విశేషం.
మనం, 24, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసిన విక్రమ్ కే కుమార్, విజయ్ దేవరకొండతో కలిసి మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్‌లో ప్రత్యక్షమవడంతో రూమర్స్ ఊపందు కున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ రాబోతోందని, దాన్ని మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోందని సమాచారం.
ఇప్పటికే సౌత్ స్టార్స్ అందరూ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సరైన కథతో, బలమైన ప్రొడక్షన్ బ్యాకింగ్‌తో హిందీ మార్కెట్‌ను రూల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మరి మ్యాడ్ డాక్ ఫిల్మ్స్, విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రాబోతుందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.