రేణు దేశాయ్.. అందరికీ ఆయనలాంటి భర్త దొరకాలి
ABN, Publish Date - Nov 29 , 2026 | 10:23 PM
శ్రీమతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. భార్యకు అండగా నిలుస్తూ, ఆమెకు సహకరించే తిరువీర్ను ప్రశంసించారు. ఆయన భార్య కల్పన నిజంగా అదృష్టవంతురాలని వ్యాఖ్యానించారు.
నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈమధ్యనే రేణు.. ఓం సినిమాలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం శ్రీమతి. నివేదా థామస్, తిరువీర్ జంటగా విశ్వక్ కందెరావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రం జీ5 లో డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా శ్రీమతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేణు దేశాయ్.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ప్రస్తుత సమాజంలో వందమంది అమ్మాయిలలను చంపేస్తున్నారు. ఒక ఇద్దరు మగవాళ్ళను చంపేస్తే.. అవే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా వందమంది అమ్మాయిలు ఎక్కడో ఒకచోట హత్యకు గురవుతున్నారు.. అత్యాచారానికి గురవుతున్నారు. చాలామంది సఫర్ అవుతున్నారు. అత్తమామల వేధింపులకు గురవుతున్నారు.నేను కొంచెం దగ్గినా కూడా ఈమధ్య హైలైట్ చేస్తున్నారు. నేను అందరి గురించి చెప్పడం లేదు. నా కళ్లతో నేను కొంతమందిని చూశాను.. వారు రాక్షసుల్లానే ఉంటారు. ఇప్పుడు బ్లూ డ్రమ్ లో మగాళ్లను చంపుతున్నారు అంటున్నారు. ఎక్కడో ఒకటి జరిగింది అని.. అన్ని అలానే అని చెప్పకండి. అసలు ఏ మనిషి ఇంకో మనిషికి హానీ తలపెట్టకూడదు. నా సర్కిల్ లోనే ఇద్దరు మగాళ్లు.. వారి భార్యలకు టార్చర్ చూపెడుతున్నారు.
చాలామంది ఆడవారు.. ఇంట్లో జరిగినవి బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. పరువు పోతుంది, ఇంట్లోవాళ్లు ఏదైనా చేస్తారేమో అన్న భయంతోనే ఎక్కువ కేసులు నమోదు కావడం లేదు. కానీ, నన్ను నమ్మండి ఎక్కువ అలాంటి కేసులే ఉన్నాయి. అయితే అందరూ మగాళ్లు అలానే ఉండరు. నాకు తెలిసిన చాలామంది మగాళ్లు ఎంతో మంచివారు. అందులో తిరువీర్ కూడా ఉన్నాడు. అతను నా సొంత తమ్ముడులా.. అతని భార్య కల్పనకు ఎంతో సపోర్ట్ గా ఉంటాడు. నేను కల్పనకు ఎప్పుడూ చెప్తాను. నువ్వు చాలా లక్కీ, నీకు తిరు లాంటి భర్త దొరికాడు అని. సినిమాలో తిరువీర్ పోషించిన పాత్రకు, నిజ జీవితంలో అతని వ్యక్తిత్వానికి అసలు సంబంధం లేదు. తిరువీర్ లాంటి భర్త ప్రతి మహిళకు ఉంటే ఎంతో బాగుంటుంది.. అతడిని చూసి ఇతర పురుషులు కూడా స్ఫూర్తి పొందాలి' అని రేణు చెప్పుకొచ్చింది.