రేణు దేశాయ్: దీక్షలో ఉన్న నన్ను నైట్ రేట్ ఎంత అని అడుగుతున్నారు
ABN, Publish Date - Mar 01 , 2026 | 01:17 PM
నెటిజన్లపై మరోసారి ఫైర్ అయ్యారు రేణూ దేశాయి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రతిరోజు అసభ్య పదజాలంతో దూషించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారామె.
నెటిజన్లపై మరోసారి ఫైర్ అయ్యారు రేణూ దేశాయి(Renu Desai). ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రతిరోజు అసభ్య పదజాలంతో దూషించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. తనపై దుర్భాషలాడిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఇంటికి వెళ్లి మరీ వాళ్ళ అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. జంతువులకు సంబంధించి ఎన్‌జీవో నడుపుతున్న రేణుపై కొందరు వ్యక్తిగత, వృత్తి జీవితంపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో వారికి సమాధానం చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘ప్రస్తుతం అమ్మవారి దీక్షలో ఉన్నానన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నా గురించి, నా వస్త్రాధారణ గురించి కామెంట్లు చేస్తున్నారు. నైట్ కి రేట్ ఎంత అని కామెంట్స్ చేస్తున్నారు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వీడియోలో ఆమె ఏమన్నారంటే..
‘నేను విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాలుగా కామెంట్లు చేస్తూ నన్ను హింస పెడుతూనే ఉన్నారు. నా వ్యక్తిగత జీవితం, నేను తీసుకున్న భరణం, నేను మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీ, నా పిల్లలు ఇలా నాకు సంబంధించి దేనిని వదలకుండా నాపై కామెంట్స్ చేస్తున్నారు. జనవరిలో వీధి కుక్కల గురించి ఓ సమావేశం ఏర్పాటు చేశా. ఎన్జీవో టీమ్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేనసలు రాను అన్నాను.. వారు రావాలని పట్టుబట్టారు. ‘వంద కుక్కలు ఉంటే అందులో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఆ పది కుక్కల కోసం మిగతా 90 కుక్కల్ని చంపకూడదని’ అన్నాను’. అంతే సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లు నన్ను టార్గెట్ చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. వ్యక్తిగత జీవితం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ముఖం చూపించడానికి ధైర్యం లేని పిరికివాళ్లు చేసే పనులివి. దమ్ముంటే మీరు చేసే పనిని మీ తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లకు చూపించండి. వారు ఏ సంస్కారంతో మిమ్మల్ని పెంచారు. నేను వీధి కుక్కల సంరక్షణార్థం ఎన్జీవో పెట్టుకున్నా. మనుషుల కోసం కాదు. నన్ను తిట్టడానికి మీకు హక్కులేదు. వేరే ఘటనలో చిన్నపిల్లలు మరణిస్తే నా మాటలను ఎడిట్ చేసి ఆ ఘటనలో నన్ను ఇరికించారు. ఇలా చేస్తున్న అందరినీ వెతుక్కుంటూ వచ్చి మీ అమ్మానాన్నల ముందు నిలబెడతా. ఇవన్నీ దిగజారి చేసే పనులు. ఇకనైనా ఈ పద్దతిని మానుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.