బాలయ్య కథతో.. రవితేజ! మాస్ రాజా మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - May 12 , 2026 | 04:50 PM
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 'ధమాకా' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వచ్చిన 'వాల్తేరు వీరయ్య' విజయంలో మెజారిటీ క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోకి వెళ్ళింది. తదనంతరం ఆయన నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ, ఫలితాలతో సంబంధం లేకుండా రవితేజ తన వేగాన్ని తగ్గించడం లేదు. ప్రస్తుతం శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ (Irumudi,)చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాతో తన మాస్ ఇమేజ్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని రవితేజ పట్టుదలతో ఉన్నారు.
ఇదే సమయంలో రవితేజ ఇద్దరు యువ దర్శకులను లైన్‌లో పెట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అందులో మొదటి ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తో ఉండబోతోంది. వాస్తవానికి వివేక్ ఆత్రేయ నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna) కోసం ఒక పవర్‌ఫుల్ మాస్ కథను సిద్ధం చేసుకున్నారు. బాలయ్య కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ, ఆయన ఇతర సినిమా కమిట్‌మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది. ఈ లోపు ఆ కథను రవితేజకు వినిపించగా, మాస్ రాజాకు ఆ పాయింట్ విపరీతంగా నచ్చేయడంతో వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించనుంది. విభిన్నమైన కథనాలతో మెప్పించే వివేక్ ఆత్రేయ, మాస్ రాజా ఎనర్జీని ఏ విధంగా వాడుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలయ్య కోసం రాసుకున్న కథ కావడంతో ఇందులో యాక్షన్ డోస్ గట్టిగానే ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రవితేజ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన, పవర్‌ఫుల్ మూవీగా నిలిచిపోతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు ‘రాజ రాజ చోర’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. హసిత్ గోలి సినిమాల్లో ఉండే వినోదం, హ్యూమర్, ఎమోషన్ రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా కూడా రవితేజను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబోతోందని సమాచారం.
రవితేజ ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి సినిమాల షూటింగ్స్ సమాంతరంగాజరపడానికి ఆయన డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఒకవైపు ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ రెండు కొత్త సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాల టైటిల్స్, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. మొత్తానికి ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో రవితేజ చేస్తున్న ఈ ప్రయాణం బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.