Ravi Teja: ‘ఇరుముడి’ నాకు కొత్త గౌరవం తీసుకొచ్చింది.. రవితేజ ఎమోషనల్!
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:43 AM
'ఏ హీరో కెరీర్ లో అయినా యావరేజ్ సినిమాలుంటాయి.. హిట్లుంటాయి.. ఫ్లాప్‌లు ఉంటాయి.. కానీ, నాకు ఈ సినిమా మరచిపోలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది’ అని రవితేజ (Ravi Teja) అన్నారు.
'ఏ హీరో కెరీర్ లో అయినా యావరేజ్ సినిమాలుంటాయి.. హిట్లుంటాయి.. ఫ్లాప్‌లు ఉంటాయి.. కానీ, నాకు ఈ సినిమా మరచిపోలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది’ అని రవితేజ (Ravi Teja) అన్నారు. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం విడుదలై మూడు వారాలు కావొస్తున్నా థియేటర్లలో ఇంకా హవా కొనసాగుతోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. గురువారం హైదరాబాద్‌లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది. దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు.
రవితేజ మాట్లాడుతూ "ఇరుముడి’కి వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు సినిమా విజయంపై ఆనందంగా ఉండటం నాకు చాలా తృప్తినిచ్చింది. నటుడిగా ఇది నాకు చాలా సంతృప్తినిచ్చిన చిత్రం. ఈ సినిమాకు దక్కుతున్న క్రెడిట్ అంతా శివ నిర్వాణకే ఇవ్వాలి. ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. అందుకే నేను ఆయనను సరదాగా ‘పని రాక్షసుడు’ అని పిలుస్తుంటాను. ఈ సినిమా కోసం నేను చాలా నైట్ షూట్స్‌లో పాల్గొన్నాను. ఇంతకుముందు నా కెరీర్‌లో ఏ సినిమాకీ ఇన్ని రాత్రి షూటింగ్స్ చేసిన గుర్తు లేదు. అయితే ఆ కష్టమంతా కూడా సినిమా ప్రయాణంలో ఒక మంచి అనుభూతిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. ముఖ్యంగా జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ఆత్మలా అనిపించింది’’ అని రవితేజ అన్నారు.
‘ఇరుముడి’ని ప్రేక్షకులు ఒక సినిమాగా కాకుండా పండగలా స్వీకరించారని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. "శివకు ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ "నేను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవడం, సినిమాను తమ సొంతం చేసుకోవడమే అతిపెద్ద విజయం. ‘నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు ‘ఇరుముడి’ నా సినిమా కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల సినిమా. వాళ్లు దీన్ని అంతగా ఆదరించారు’’ అని తెలిపారు.