రవితేజ.. ఇప్పటికైనా అర్థమైందా

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:17 PM

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా కెరీర్‌లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే.

Raviteja

మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా కెరీర్‌లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. వయసు పెరుగుతున్నా ఇంకా రొటీన్ మాస్ మసాలా ఫార్ములాలు, యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు, లాజిక్ లేని ఫైట్లు చేయడం వల్ల ప్రేక్షకులు ఆయన సినిమాలను తిరస్కరిస్తూ వచ్చారు. గత నాలుగేళ్లలో రవితేజ తీసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అయితే, ఈ ప్రతికూలతలన్నింటికీ చెక్ పెడుతూ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి(Irumudi) చిత్రంతో రవితేజ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాడు.


ఈ విజయం సినీ వర్గాలకు, నటులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు ఎప్పుడూ నటుడి వయస్సును, ఇమేజ్‌ను మాత్రమే చూడరని, బలవంతంగా రుద్దే మాస్ అంశాల కంటే బలమైన కంటెంట్, ఎమోషన్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని ఇరుముడి రుజువు చేసింది. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మేనరిజమ్స్, బిగ్గరగా అరిచే డైలాగులను, క్రింజ్ కామెడీని పక్కనపెట్టి, అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న ఒక తండ్రిగా తన వయస్సుకు తగిన పరిణతి చెందిన పాత్రను పోషించాడు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను ఆయన పండించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


మలయాళం చిత్రాల్లో కనిపించే తరహా సహజసిద్ధమైన కథాంశాన్ని ఎంచుకుని, దేవతా విశ్వాసాలు, క్రైమ్, రివెంజ్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా మిక్స్ చేసి తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తారాగణం ఎంత పెద్దదైనా కథలో దమ్ముండాలనే సత్యాన్ని రవితేజ గ్రహించి చేసిన ఈ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. ఇప్పటికైనా రవితేజ లాంటి అగ్ర కథానాయకులు తమ ఇమేజ్ చట్రం నుండి బయటపడి, వయస్సుకు తగ్గ వైవిధ్యమైన పాత్రలు, బలమైన కథలను ఎంచుకుంటే బాక్సాఫీస్ వద్ద వారికి ఎల్లప్పుడూ బ్రహ్మరథం పడతారని ఇరుముడి విజయం మరోసారి చాటిచెప్పింది. మరి ఇకనుంచి అయిన రవితేజ.. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి కథలు కావాలని కోరుకుంటున్నారో అర్ధం చేసుకొని.. అందుకు తగ్గట్లు కథలను ఎంచుకుంటే మళ్లీ మాస్ మహారాజా హిట్ ట్రాక్ ఎక్కినట్లే అని చెప్పుకొస్తున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 05:20 PM