దర్శకుడిగా.. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అసిస్టెంట్ డైరెక్టర్
ABN, Publish Date - Oct 23 , 2026 | 08:14 AM
డాక్టర్ దామోదర్ నేరేళ్ల డ్రీమ్ ప్రాజెక్టుగా డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభమైంది. శశాంక్ దువ్వూరు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల, నేహా పఠాన్ నటిస్తున్నారు.
సినిమాలపై చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టాన్ని నిజం చేసుకుంటూ నిర్మాతగా మారారు డాక్టర్ దామోదర్ నేరేళ్ల. డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ప్రొడక్షన్ నంబర్ 1’గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శశాంక్ దువ్వూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
తనకు సినిమాలంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టమని, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమాను చూడటానికి స్కూల్‌కు వెళ్లకుండా వరంగల్ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని డాక్టర్ దామోదర్ నేరేళ్ల గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు శశాంక్ దువ్వూరు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే అంశాలు ఉన్నాయని, దర్శకుడి ప్రతిభపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
డాక్టర్ దామోదర్ నేరేళ్ల ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 26 ఏళ్లుగా యూకే, అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన, మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
శశాంక్ దువ్వూరుకు దర్శకుడిగా ఇది తొలి సినిమా. గతంలో రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘ఉల్టా’ అనే షార్ట్ ఫిలింను కూడా రూపొందించారు. ఇప్పుడు తన దర్శకత్వంలో తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పైకి లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్లా కనిపించినా, కథలో బలమైన కాన్సెప్ట్ ఉంటుందని శశాంక్ తెలిపారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే ఈ కథలో వినోదంతో పాటు విభిన్నమైన అంశాలను ఆసక్తికరంగా చూపించనున్నట్లు చెప్పారు.
ఈ చిత్రంలో రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. రొమాంటిక్ అంశాలతో ప్రారంభమయ్యే కథ క్రమంగా సైన్స్ ఫిక్షన్ వైపు మలుపు తిరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నటీనటులు తెలిపారు. కొత్త కథనం, ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులకు భిన్నమైన సినిమా అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టైటిల్ పోస్టర్‌తో పాటు ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.