‘రంగస్థలం’ మహేష్ హీరోగా ‘శివాలయం’.. టీజర్, పోస్టర్ విడుదల
ABN, Publish Date - Nov 10 , 2026 | 10:27 AM
‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా ఆలయ సెట్ ఏర్పాటు చేశారు.
భక్తి, ఆధ్యాత్మికత నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో సినిమా రాబోతోంది. అదే ‘శివాలయం’ (Shivalayam Movie). శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమతి శ్రీ లక్ష్మీనర్సింహారెడ్డి చిత్రాలయం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ఈ వేడుక కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా శివాలయం తరహా సెట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది.
ఈ కార్యక్రమానికి నిర్మాతలు ఈద రవి రాజా, సాయిలక్ష్మణ్ అల్లు, నబీ షేక్, పి. నాగలక్ష్మి, కుప్పిలి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీజర్, పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి, ధన్‌రాజ్, సుష్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్‌రెడ్డి నందితో పాటు కళ్లెం నర్సింహారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం, విడుదల విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దర్శకుడు వెంకట్‌రెడ్డి వరుసగా సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆయన ప్రతిభావంతుడైన దర్శకుడని పేర్కొంటూ ‘శివాలయం’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సీనియర్ నటుడు నాగ మహేష్ ఈ సినిమాలో మంచి పాత్రతో పాటు ఓ పాటలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము మాట్లాడుతూ.. చిత్రంలో మూడు పాటలు ఉన్నాయని, తనకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడికి ధన్యవాదాలు చెప్పారు.
హీరో ఆచంట మహేష్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డికి వ్యవసాయ రంగంలో మంచి అనుభవం ఉందని, గతంలో నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి తమ సినిమాను నిర్మించడం గర్వంగా ఉందన్నారు. హీరోయిన్ దీప్తిరెడ్డి తనకు ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణే తమకు ముఖ్యమని చెప్పారు. మరో నటి సుష్మ మాట్లాడుతూ.. సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ.. పరిమిత సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడిని అభినందించారు. తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమన్నారు. 89 ఏళ్ల వయసులోనూ సినిమా నిర్మాణంపై ఎంతో ఆసక్తి, నిబద్ధత చూపుతున్న నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రంలో ఘర్షణ శ్రీనివాస్, సమ్మెట గాంధీ, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్, పోస్టర్ విడుదలతో ‘శివాలయం’ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.