సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ranabaali Trailer: పుట్టపర్తి నడిరోడ్డుపై పండబెట్టి నీ జాతిని నరుకుతా.. విజయ్ విశ్వరూపం

ABN, Publish Date - Oct 08 , 2026 | 07:41 PM

దసరా స్పెషల్‌గా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోన్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను గురువారం మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ రివ్యూ ఇదే.

Ranabaali Trailer Review

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా.. ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). దసరా స్పెషల్‌గా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోన్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను గురువారం మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో తుఫాను రేపుతోంది. రాయలసీమ గడ్డపై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఓ అజ్ఞాత పోరాట యోధుడి కథగా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఎలా ఉందో పరిశీలిస్తే..


అనంతపురం నేల, పాళెగాళ్ల పౌరుషాన్ని వర్ణించే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 200 ఏళ్ల క్రితం శింగనమల గుట్టల్లో తపస్సు చేసిన మహర్షి, భద్ర మల్లన్న కథతో ముడిపడి ఉన్న నేపథ్యాన్ని ఆవిష్కరించారు. ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను బానిసలుగా మార్చడం, ఆకలి చావులను, కరవును అడ్డుపెట్టుకుని రైల్వే లైన్ల నిర్మాణానికి బలవంతపు చాకిరీ చేయించుకోవడం చూపిస్తూ బ్రిటీషర్ల అణచివేతను అత్యంత సహజంగా, క్రూరంగా ప్రెజెంట్ చేశారు. పని చేయకపోతే అన్నం పెట్టబోమంటూ ప్రజలపై జులం ప్రదర్శిస్తున్న వేళ.. ఆ ఆగడాలను అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడు హీరో ‘రణబాలి’.

విజయ్ దేవరకొండ ఎంట్రీ ట్రైలర్‌కు ప్రాణంగా నిలిచింది. గంభీరమైన గడ్డం, సాంప్రదాయ ధోవతి, గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో వేటకొడవలి పట్టుకుని పాతకాలపు పాళెగాడి అవతారంలో విజయ్ లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ‘ఏరా తెల్లోడా.. మీకేం పనిరా ఇక్కడ? మా దేశం వదిలి పోతారా.. లేక నరుక్కుంటూ పోవాలా?’ అంటూ ఆయన బ్రిటీషర్లను హెచ్చరిస్తూ చెప్పే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. ట్రైలర్ చివరిలో వచ్చే.. ‘‘నిన్నూ, నీ రాణినీ, నీ జాతి మొత్తాన్ని పుట్టపర్తి నడిరోడ్డుపై నరకకపోతే.. వాణెక్క! నా పేరు శింగనమల బొబ్బిలి రణబాలే కాదు!’’ అనే శపథం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది.


ఇంతటి యాక్షన్, పోరాటాల నడుమ రష్మిక మందన్న (జయమ్మ పాత్ర) పాత్ర ద్వారా చిన్నపాటి వినోదం, ప్రేమను కూడా దర్శకుడు చక్కగా చూపించారు. ‘నన్ను పెళ్లి చేసుకున్నావా? ఆ గుర్రాన్ని చేసుకున్నావా? నన్ను పట్టించుకోకపోతే బావిలో దూకుతా’ అంటూ అలిగే పల్లెటూరి భార్యగా రష్మిక హావభావాలు, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. వంశాన్ని నిలబెట్టే వారసుడి ప్రస్తావనతో కథలో ఎమోషనల్ లేయర్స్ కూడా బలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. అజయ్-అతుల్ (Ajay-Atul) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సన్నివేశాల్లోని తీవ్రతను, ఉద్రిక్తతను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అద్భుతంగా ఎలివేట్ చేశారు. 19వ శతాబ్దపు కరువు కాలం, పల్లె వాతావరణం, శింగనమల లొకేషన్లు, రైల్వే నిర్మాణపు సెట్లు అత్యంత సహజంగా ఉన్నాయి. కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన భారీ ఖర్చును కళ్లకు కట్టింది. రాహుల్ సాంకృత్యన్ హిస్టారికల్ పీరియాడిక్ కథను ఎంచుకోవడమే కాకుండా, దాన్ని కేవలం డాక్యుమెంటరీలా కాకుండా భారీ కమర్షియల్ మాస్ ఎలివేషన్లతో తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. ‘రణబాలి’ ట్రైలర్ విజువల్ గ్రాండియర్‌తో, విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనతో రౌడీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంది. చాలా కాలం తర్వాత విజయ్ ఒక రా అండ్ రస్టిక్ పీరియాడిక్ రోల్‌లో కనిపిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో రికార్డుల వేట మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’ నిర్మాత ఆఫీసుల్లో ఐటీ దాడులు.. స్టాక్ మార్కెట్‌‌పై ప్రభావం

ఆ డైరెక్టర్‌కు నో చెప్పిన రామ్ చరణ్.. కారణం అదేనా?

నమ్మలేకపోతున్నాం.. నానా పటేకర్ మృతిపై సెలబ్రిటీలు

Updated Date - Oct 08 , 2026 | 09:13 PM