పెద్ది వాయిదా పక్కా.. అసలు కారణం ఇదే..?
ABN, Publish Date - Apr 07 , 2026 | 11:53 AM
రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత చేస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) త్రిబుల్ ఆర్ తర్వాత చేస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పెద్ది (Peddi) అనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా అభిమానులు ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెడుతోంది. అదే పెద్ది వాయిదా..ఇప్పటికే మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడ్డ పెద్ది ఇప్పుడు ఆ తేదీకి కూడా రావడం కష్టమేనా..? పెద్ది లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి..?
దాదాపు ఏడాదిన్నర కాలంగా శ్రమిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రీసెంట్‌గా వచ్చిన అఫీషియల్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ, లోపల జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. ఇంకా రెండు కీలకమైన పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉండటంతో పాటు, భారీ ఎత్తున ప్లాన్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం పట్టేలా ఉంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (A R Rahman) అతిపెద్ద బలం. ఆయన బాణీలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అంచనా. అయితే, రెహమాన్ పనితీరు ఎప్పుడూ కాస్త భిన్నంగా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఆయన అస్సలు రాజీ పడరు. అందుకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, క్షుణ్ణంగా పరిశీలిస్తూ వర్క్ చేస్తున్నారట. ఆయన నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రావాలంటే మేకర్స్ కూడా సమయం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.
అసలు విషయం ఏమిటంటే.. సినిమాను మే నెలలో విడుదల చేయాలని మొదట భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదిరేలా లేదు. జూన్ నెలకు సినిమాను పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నిజానికి టాలీవుడ్‌లో సమ్మర్ అనేది అత్యంత లాభదాయకమైన సీజన్. అటువంటి పెద్ద అవకాశాన్ని వదులుకొని, స్కూళ్లు, కాలేజీలు మళ్లీ ప్రారంభమయ్యే జూన్ నెలలో రావడం అంటే అది మామూలు రిస్క్ కాదు.
ఇది చిత్ర యూనిట్ చేస్తున్న ఒక సాహసమనే చెప్పాలి. ఒకవైపు బుచ్చిబాబు (Buchi Babu Sana)మేకింగ్ స్టైల్, మరోవైపు చరణ్ కొత్త లుక్.. వెరసి పెద్దిపై భారీ హైప్ ఉంది. మరి ఈ గ్యాప్‌ను మేకర్స్ ఎలా మేనేజ్ చేస్తారు..? జూన్ నెలలో వచ్చినా కూడా చరణ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారా..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒకవేళ లేట్ అయినా సరే, అవుట్‌పుట్ అదిరిపోతే చాలు అని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.