Ramba Oorvasi Menaka Teaser: రంభ ఊర్వశి మేనకలు.. అదిరారు

ABN , Publish Date - Aug 11 , 2026 | 05:54 PM

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు.

Ramba Oorvasi Menaka

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఫాంటసీ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka). చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష సరసన సురభి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ఆఫీషియల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమా కథ అంతా ఒక విచిత్రమైన, సరదా ఫాంటసీ కాన్సెప్ట్‌తో సాగుతుంది. నరేష్ .. తన కొడుకుకు ఒక మ్యాజిక్ బుక్ చూపించి.. దానిపై ఉన్న ముగ్గును సరైన పద్దతిలో వేస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి దిగుతారని చెప్తూ పెంచుతాడు. దీంతో అల్లరి నరేష్ అదే నిజమని నమ్మి.. పెద్ద స్టార్ కావాలనే కోరికతో 15 ఏళ్లుగా రంభ, ఊర్వశి, మేనకలకు పూజలు చేస్తూ ఆ ముగ్గు వేస్తూ ఉంటాడు. ఇక అలా ముగ్గు వేయడం వలన పైన ఇంద్ర లోకంలో ఉన్న ఇంద్రుడు ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. అనుకోకుండా ఇంద్రుడుకి కూడా చెప్పకుండా రంభ, ఊర్వశి, మేనక భూలోకంకు వచ్చేస్తారు. అసలు వారెందుకు భూమి మీదకు వచ్చారు. వారు రావడం వలన అల్లరి నరేష్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి.. ? చివరికి ఆ బుక్ మీద ఉన్న ముగ్గును సరిగ్గా వేశాడా.. ? ఇంద్రుడు కోపం వెనుక కారణమేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


టీజర్ చూశాక అల్లరి నరేష్ వింటేజ్ కామెడీ గుర్తురాకమానదు. ఇక సినిమాకు హైలైట్ అంటే రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో నటించిన అందగత్తెలే. సోషల్ మీడియాని తన అందంతో ఊపేసిన విష్ణుప్రియ, టాలీవుడ్ ని అందంతో పిచ్చెక్కించిన రాశీ సింగ్.. ఈ సినిమాలో దేవతలుగా దర్శనమిచ్చారు. నిజంగానే రంభ, ఊర్వశి, మేనక ఇంతే అందంగా ఉంటారా అనిపించేలా కనిపించారు.చేతన్ భగత్ మ్యూజిక్ అదిరిపోయింది. క్యూట్ అండ్ కాస్మిక్ కామెడీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అల్లరి నరేష్ పాత రోజుల్లోని టైమింగ్‌ను గుర్తుచేసేలా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 11 , 2026 | 05:54 PM