Rapo: రామ్..100 కోట్ల సాహాసం!
ABN, Publish Date - Jun 30 , 2026 | 08:49 PM
రామ్ పోతినేని 'రాపో 23'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా మారనుంది.
రామ్ పోతినేని హీరోగా ‘రాపో 23’ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతో రామ్ (Ram Pothineni) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. అనంతరం నిర్మాత కృష్ణ పోతినేని రామ్‌కు స్ర్కిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి.వి. రవికిషోర్ క్లాప్ కొట్టారు. పి.మురళీ మోహన్ కెమెరా స్విఛ్చాన్ చేయగా.. దర్శకుడిగా తన కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతూ రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో మొదలు కానుందని మేకర్స్ చెప్పారు.
సాధారణంగా హీరోలు దర్శకులుగా మారడం టాలీవుడ్‌లో కొత్త కాకపోయినా, రామ్ విషయంలో మాత్రం ఇది అభిమానులను విస్మయానికి గురిచేసింది. దర్శకత్వంపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని ఆయన ఎప్పుడూ బయటపెట్టకుండా సైలెంట్‌గా తన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గతంలో ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా కోసం గీత రచయితగా మారి ఒక పాట రాసిన రామ్, ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి దర్శకుడిగా ప్రమోట్ అయ్యారు. ఈ సినిమాను సైకలాజికల్ డ్రామా, హై-ఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో నియో-నోయిర్ నేపథ్యంలో మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా రామ్‌కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు నిరాశపరచడంతో, ప్రతి సినిమా తర్వాత కచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తారనే ఆశలు ఉన్నా అవి ఫలితాలుగా మారలేదు. ఇటీవల వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కినప్పటికీ, కమర్షియల్‌గా అది కెరీర్‌ను పెద్దగా మలుపు తిప్పలేకపోయింది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఒకేసారి హీరోగా, దర్శకుడిగా డబుల్ బాధ్యతలు తీసుకోవడం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఒకవైపు నటుడిగా తన పాత్రకు న్యాయం చేస్తూనే, మరోవైపు మొత్తం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఇప్పుడు రామ్ భుజాలపై పడింది.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే అత్యధికంగా దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం మరింత రిస్క్‌తో కూడుకున్న విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తే నటుడిగా ఆయన మార్కెట్ తిరిగి పుంజుకోవడంతో పాటు దర్శకుడిగా కూడా సరికొత్త గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ ఫలితం తేడా వస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనా, తనలోని కొత్త సృజనాత్మక కోణాన్ని నిరూపించుకోవడానికి రామ్ పోతినేని ఎదుర్కొంటున్న ఈ డబుల్ ఛాలెంజ్ ఆయన సినీ భవిష్యత్తును నిర్ణయించే ఒక అత్యంత కీలకమైన పరీక్ష కానుంది.