Fight Maha: వర్మ ఆవిష్కరించిన 'ఫైట్ మహా' టీజర్
ABN, Publish Date - Jul 15 , 2026 | 12:23 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బావ ఏవీయస్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఫైట్ మహా'. ఈ మూవీ టీజర్‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ పదిహేనేళ్ళ క్రితం సునీల్ హీరోగా 'కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు వర్మ బావ ఏవీయస్ రాజు... ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్రతో కలిసి 'ఫైట్ మహా' అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్‌తో పాటు అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ భరత్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కేరళలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను రామ్ గోపాల్ వర్మ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు వంశీ, దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ బీవీఎస్ రవి, పాటల రచయిత సిరాశ్రీ, ఆర్జీవి సోదరి విజయ, దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఏవీఎస్ రాజు మాట్లాడుతూ, 'దర్శకుడు ఆనంద్ చంద్ర చెప్పిన కథ బాగా నచ్చింది. అదే మమ్మల్ని ఈ సినిమా నిర్మించేలా చేసింది. అతను కథను ఎలా చెప్పాడో అలానే తెరకెక్కించాడు' అని అన్నారు. డైరెక్టర్ ఆనంద్ చంద్ర మాట్లాడుతూ, 'ఇదో వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది. మహా అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన లైఫ్ తో ఫైట్ చేస్తుంటాడు. అందుకే 'ఫైట్ మహా' అనే టైటిల్ మా మూవీకి పెట్టాం. జీవితంలో నిరాశతో ఏదీ వదిలి పెట్టవద్దు, పోరాడుతూనే ఉండాలి అనే మంచి విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్, డ్రామా జానర్‌లో మా సినిమా రూపొందించాం' అని అన్నారు. రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ, 'ఈ మూవీ పాటలను గతంలో ప్రొడ్యూసర్స్ చూపించారు. పాటలు చాలా బాగున్నాయి. టీజర్ బాగుంది. ఈ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్‌నే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. లిరిక్ రైటర్ సిరాశ్రీ మాట్లాడుతూ, 'మూవీ టీజర్ బాగుంది. టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అలాగే ట్రైలర్ తో సినిమా చూసే ఇంట్రెస్ట్ కలగాలి. టీజర్‌తోనే ఈ టీమ్ మనల్ని ఆకట్టుకున్నారు' అని అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, 'శివ సినిమాలో స్టడీ కెమెరా షాట్స్‌కు నాకు మంచి పేరొచ్చింది. అయితే స్టడీ కెమెరాస్ రాకముందే డైరెక్టర్ వంశీ గారు 'అన్వేషణ' మూవీలో నాకంటే బాగా సీన్స్ రూపొందించారు. 'ఫైట్ మహా'లో చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. అక్కడక్కడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ మన ప్రేక్షకులకు మాత్రం ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఆనంద్ డైరెక్టర్‌గా బాగా సినిమాను తెరకెక్కిస్తాడని తెలుసు. ఎమోషన్, థ్రిల్ వంటి ఎలిమెంట్స్‌ను అతను బాగా డీల్ చేశాడని అనుకుంటున్నాను. ట్రైలర్ కోసం వేచి చూస్తున్నాను' అని అన్నారు. శ్రీరామ్ తపస్వి పాటలు రాసిన ఈ చిత్రానికి వసంత్ ఇసైపెట్టై సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
మాది అఫీషియల్.. ఎన్టీఆర్‌కే షాకిచ్చిన రాఎన్టీఆర్!
Priyanka Chopra: 14 నెలలుగా 'వారణాసి' కోసం కష్టపడుతున్నా.. ప్రియాంకా చోప్రా అంత మాట అనేసిందేంటి