RC17 కోసం రామ్ చరణ్ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్
ABN, Publish Date - Aug 11 , 2026 | 07:42 PM
సినిమా కోసం, తను పోషించే పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
సినిమా కోసం, తను పోషించే పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). పాత్ర డిమాండ్ చేస్తే శారీరకంగా ఎంతో కష్టపడి, కఠినమైన శిక్షణ తీసుకుని, స్క్రీన్ మీద తన నటనతో మ్యాజిక్ చేయడం చరణ్‌కు అలవాటే. ఇటీవల బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం ఏ స్థాయిలో ఉందో మనం చూశాం. దాదాపు 16 నెలల పాటు కఠినమైన డైట్, వర్కవుట్లతో ఒక పక్కా 'దేశీ పెహల్వాన్' లాంటి భారీ కండల శరీరంతో కుస్తీ యోధుడిగా థియేటర్లలో పూనకాలు తెప్పించారు. అయితే ఇప్పుడు 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం మరొక ఊహించని శారీరక మార్పుకు సిద్ధమవుతున్నారు. ఆ
టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన 'రంగస్థలం' చిత్రం తర్వాత డైరెక్టర్ సుకుమార్ (sukumar)తో రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్ RC17. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే అటు అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గబోతున్నారట. 'పెద్ది'లో కనిపించిన భారీ కండల బాడీకి పూర్తి భిన్నంగా, చాలా సన్నగా, లీన్ లుక్‌లో చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. సుకుమార్ విజన్‌కు తగ్గట్టుగా చరణ్ తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారట. ఈ కొత్త లుక్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌పై శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయి లాక్ అయిపోయిందట. ప్రస్తుతం సెకండ్ హాఫ్‌పై, ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్‌ను మైండ్ బ్లోయింగ్‌గా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్ డ్రాఫ్టింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో చరణ్ సరసన నటించేందుకు కన్నడ గ్లామర్ బ్యూటీ, 'డ్రాగన్' ఫేమ్ రుక్మిణి వసంత్ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇటీవల రామ్ చరణ్‌కు మణికట్టుకు చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న చరణ్, మణికట్టు గాయం పూర్తిగా నయమైన వెంటనే తన కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారట. సుకుమార్ డిజైన్ చేసిన ఈ కొత్త క్యారెక్టర్ కోసం చరణ్ మళ్ళీ జిమ్‌లో చెమటోడ్చేందుకు సిద్ధమవుతున్నారట. 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడకతప్పదు.