RC 17: చరణ్‌కు సర్జరీ.. దసరా తర్వాతే సుకుమార్‌తో 'ఆర్సీ 17' షూటింగ్?
ABN, Publish Date - Jun 21 , 2026 | 06:40 PM
రామ్‌చరణ్ చేతికి గాయమై సర్జరీ చేయించుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్సీ 17' షూటింగ్ దసరా తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ఈ క్రేజీ కాంబో మరోసారి సిద్ధమైంది. 'ఆర్సీ 17' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను గతంలోనే అధికారికంగా ప్రకటించారు. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్, ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సుకుమార్, చరణ్ కూర్చొని కథ విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.
అయితే, ఈ సినిమా కథా చర్చలు దాదాపు చివరి దశకు చేరుకున్నప్పటికీ, సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్నదానికంటే కాస్త ఆలస్యం కానుందట. దసరా పండగ తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల జరిగిన గాయమేనని తెలుస్తోంది. చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో ఆయన చేతికి గాయమైంది. దీనికి సంబంధించి ఇప్పుడు చరణ్ ఒక చిన్న సర్జరీ చేయించుకోబోతున్నారని సమాచారం. సర్జరీ అనంతరం వైద్యుల సలహా మేరకు ఆయన కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
రామ్ చరణ్ కోలుకోవడానికి సమయం పడుతుండటంతో, ఈ గ్యాప్‌ను దర్శకుడు సుకుమార్ పూర్తిగా ‘ఆర్సీ 17’ ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కథకు తుది మెరుగులు దిద్దడం, సినిమాకు సరిపోయే లొకేషన్ల వేట, అలాగే ఇతర సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేయడం వంటి పనులపై సుక్కు దృష్టి పెట్టనున్నారు. ఈ పనులన్నీ పూర్తి కావడానికి దసరా వరకు సమయం పడుతుందని అంచనా. ఎలాగూ చరణ్ కూడా అప్పటికి పూర్తిగా కోలుకుంటారు కాబట్టి, అంతా పక్కాగా సిద్ధం చేసుకుని దసరా శుభ ముహూర్తాన ఈ క్రేజీ కాంబోను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ, చరణ్ సర్జరీ, షూటింగ్ వాయిదాపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక క్లారిటీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'ఆర్సీ 17' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ మార్క్ టేకింగ్, చరణ్ మాస్ ఇమేజ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.