వరుణ్ ధావన్‌తో 'పెద్ది' ఢీ..! బాక్సాఫీస్ బద్ధలేనా?
ABN, Publish Date - May 07 , 2026 | 09:50 PM
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధం. హిందీలో వరుణ్ ధావన్ మూవీతో పోటీ ఉన్నా జియో స్టూడియోస్ భారీ రిలీజ్ ప్లాన్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Sana buchibabu) కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం పెద్ది (Peddi) గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ, ఇప్పుడు ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది. ప్రస్తుతం చిత్ర బృందం తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని పూర్తిగా మార్చుకోవడం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
అయితే.. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్లను నిర్వహిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మే మూడవ వారంలో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న 'ఐటమ్ సాంగ్'ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అంతకుముందే ఒక పవర్‌ఫుల్ ట్రైలర్‌తో కథలోని ఇంటెన్సిటీని, ఎమోషన్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ వ్యూహం సినిమాపై బజ్ పెంచడానికి దోహదపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో బలమైన ప్రభావం చూపేలా ముంబై, చెన్నై, కేరళ వంటి ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనగా, త్వరలోనే రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ పలు జాతీయ స్థాయి మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొననున్నారట. నిర్మాత సతీష్ కిలారు ఎక్కడా తగ్గకుండా అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను రూపొందించారు. దీని ఫలితంగానే విడుదలకు ముందే ఈ చిత్రం రికార్డు స్థాయి థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
ఇక పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ అత్యంత కీలకం కావడంతో, అక్కడ సినిమా ప్రదర్శనపై చర్చలు మొదలయ్యాయి. సరిగ్గా 'పెద్ది' విడుదలైన మరుసటి రోజున (జూన్ 5) వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai) సినిమా విడుదల కానుంది. దీనివల్ల ఉత్తరాదిలో థియేటర్ల కేటాయింపు, స్క్రీన్ల విషయంలో పోటీ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, వరుణ్ ధావన్ సినిమాపై ప్రస్తుతం అంతగా క్రేజ్ లేకపోవడం పెద్ది చిత్రానికి కలిసొచ్చే అంశం. హిందీలో రామ్ చరణ్‌కు ఉన్న గుర్తింపు పెద్ది సినిమాకు ప్రధాన బలం.
ప్రస్తుతానికి అక్కడ బజ్ కాస్త తక్కువగా ఉన్నా, సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయం. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'జియో స్టూడియోస్' ఈ సినిమాను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. థియేటర్ల పంపిణీ విషయంలో ముందే ఒక పక్కా ప్రణాళికతో ఉండటం వల్ల, ఇతర సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ 'పెద్ది'కి స్క్రీన్ల కొరత ఉండే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.