'పెద్ది' ట్రైలర్.. లెక్కలు తేలుస్తుంది
ABN, Publish Date - May 06 , 2026 | 10:41 AM
ఏదైనా పెద్ద సినిమా బాక్సాఫీస్ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ విదితమే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా (Sana buchibabu) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'చికిరి', 'రై రై రారా' వంటి సాంగ్స్ చార్ట్‌బస్టర్స్ గా నిలిచి సంగీత పరంగా ఒక బలమైన పునాదిని వేశాయి.
ఏదైనా పెద్ద సినిమా బాక్సాఫీస్ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ విదితమే. 'పెద్ది' విషయంలో కూడా ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. టీజర్లు క్యూరియాసిటీని పెంచినప్పటికీ, అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందనే 'వైబ్' మాత్రం ట్రైలర్ ద్వారానే తెలుస్తుంది. ఒకవేళ ట్రైలర్ గనుక బలమైన ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. మొదటి రోజు వసూళ్లపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.
ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 400-425 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. సాధారణంగా ఒక భారీ చిత్రం తన బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో దాదాపు 25-30% వరకు కేవలం ఓపెనింగ్స్ ద్వారానే రికవరీ చేయాల్సి ఉంటుంది. అందుకే 'పెద్ది' చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ చాలా అవసరం. రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ మాస్ అవతారంలో కనిపించబోతుండటం ఇంకా అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుండటం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో మెరవనున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో వేగంగా దూసుకుపోతున్న ఈ చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో మేకింగ్ విలువలు అద్భుతంగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
జూన్ మొదటి వారంలో 'పెద్ది' సినిమాకు పోటీగా మరే ఇతర పెద్ద సినిమాలు లేకపోవడం బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఈ క్లీన్ విండోను వాడుకుని భారీ వసూళ్లు సాధించాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం స్టార్ పవర్ మీద మాత్రమే కాకుండా, కథలోని దమ్ముతో ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరం ఉంది. పాటలు తమ పనిని పూర్తి చేశాయి కాబట్టి, ఇప్పుడు మొత్తం భారం ట్రైలర్ మీదనే ఉంది. ఆ ట్రైలర్ గనుక అంచనాలను అందుకుంటే, జూన్ 4న బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సునామీ సృష్టించడం ఖాయం.