Peddi: 'పెద్ది' హంగామా.. రామ్ చరణ్‌కు గుడి కట్టేసిన ఫ్యాన్స్
ABN, Publish Date - Jun 03 , 2026 | 06:19 PM
'పెద్ది' సినిమా కాసేపట్లో ప్రేక్షకులను పలకరించ బోతుండడంతో థియేటర్స్ దగ్గర 'పెద్ది' హంగామా ఆషామాషీగా లేదు.
మరి కొన్ని గంటల్లో 'పెద్ది' సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది. థియేటర్స్ దగ్గర 'పెద్ది' హంగామా ఆషామాషీగా లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కొందరు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఈ మూవీ ఎవరెవరికి కీలకంగా మారిందో చూద్దాం.
ముగ్గురికీ కీలకం..!
'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడడంలో ఓ విశేషముంది. 'ట్రిపుల్ ఆర్' గ్రాండ్ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా జేజేలు అందుకున్నారు రామ్ చరణ్. ఆ మూవీతో ఆయనకు దేశవిదేశాల్లో ఎంతోమంది ఫ్యాన్స్ లభించారు. ముఖ్యంగా జపాన్ లో 'ట్రిపుల్ ఆర్' తరువాత ఆ సినిమా హీరోలిద్దరికీ అక్కడ విశేషాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ 'పెద్ది' జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతోందని తెలిసి, కొందరు జపాన్ లేడీ ఫ్యాన్స్ మన దేశానికి వచ్చారు. వారు 'పెద్ది' సినిమాను హైదరాబాద్ లోనే చూసి, ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నారట.
ఈ మూవీ ఘనవిజయం సాధిస్తే రామ్ చరణ్ కు చాలా రోజుల తరువాత ఓ బిగ్ హిట్ దక్కినట్టవుతుంది. అలాగే ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానాకు 'ద్వితీయ విఘ్నం' తొలగిపోతుంది. బుచ్చిబాబు తన తొలి సినిమా 'ఉప్పెన'తో బంపర్ హిట్ సాధించారు. ఈ మూవీతోనూ ఓ బిగ్ హిట్ పట్టేస్తే పలువురు స్టార్స్ బుచ్చిబాబు వెంట పడే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న 'వృద్ధి సినిమాస్' అధినేత వెంకట సతీశ్ కిలారుకు నిర్మాతగా ఇదే మొదటి సినిమా. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధిస్తే తొలి ప్రయత్నంలోనే వెంకట సతీశ్ బిగ్ హిట్ ను పట్టేసినట్టవుతుంది. అలా 'పెద్ది' గ్రాండ్ సక్సెస్ హీరో రామ్ చరణ్ కు, డైరెక్టర్ బుచ్చిబాబుకు, నిర్మాత వెంకట సతీశ్ కిలారుకు ఎంతో కీలకంగా మారింది.
'పెద్ది'కి గుడి..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల ఉత్సాహం పరుగులు తీస్తోంది. తమ హీరోకు 'పెద్ది' సినిమాతో బంపర్ హిట్ రావాలని చెర్రీ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. మరికొందరు 'పెద్ది'లో పహిల్వాన్ లా ఉన్న రామ్ చరణ్ విగ్రహాన్నే ప్రతిష్ఠించేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేవ్ చూస్తోంటే 'పెద్ది' భారీ ఓపెనింగ్స్ సాధించేలా కనిపిస్తోంది. హైదరాబాద్ కుకట్ పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద 'పెద్ది'లోని రామ్ చరణ్ విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేశారు ఫ్యాన్స్. దాని చుట్టూ ఓ గుడి సెట్ వేసి 'కొణిదెల వారి ఆలయం', 'రామ్ చరణ్ ఆలయం' అంటూ అభిమానులు ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూండడం విశేషం. ఈ బొమ్మ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. 'ట్రిపుల్ ఆర్' తరువాత సరైన సక్సెస్ చూడని రామ్ చరణ్ కు 'పెద్ది' బంపర్ హిట్ ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
'పెద్ది' టీమ్ కు పవన్ విషెస్
'పెద్ది' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా సాగింది. ఈ వేడుకలో చెర్రీ బాబాయ్, ఏపీ డిప్యూటీ సీయమ్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వినిపించింది. అయితే పని ఒత్తిడి వల్ల పవన్ ఆ కార్యక్రమంలో పాల్గొనలేక పోయారు. ఈ నేపథ్యంలో 'పెద్ది' టీమ్ ను విష్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓ లేఖ విడుదల చేశారు. దాంతో మెగాకాంపౌండ్ ఫ్యాన్స్ అమితానందం చెందుతున్నారు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించాలని పవన్ తన లేఖలో ఆశించారు.
'పెద్ది' వేడుకలో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన ప్రతీసారి అభిమానుల నుండి ఎంతో ప్రతిస్పందన లభించింది. ఈ క్రమంలో 'పెద్ది' టీమ్ ను అభినందిస్తూ పవన్ రాసిన లేఖ ఓ ప్లస్ పాయింట్ గా మారనుందని భావిస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పెద్ది'కి టిక్కెట్ రేట్స్ హైక్ చేసుకొనే వీలు కలిగింది. దాంతో 'పెద్ది' ఓపెనింగ్స్ సరికొత్త రికార్డ్ సాధిస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి మొదటి రోజున 'పెద్ది' వసూళ్ళు ఏ రేంజ్ ఉంటాయో చూడాలి.