పెద్ది.. నిజంగా వాయిదా పడనుందా? కావాలని.. లీక్ చేశారా
ABN, Publish Date - Apr 01 , 2026 | 06:13 AM
రామ్‌చరణ్ నటిస్తున్న‘పెద్ది’ ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఆ రోజున ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది.
రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న‘పెద్ది’ (Peddi) ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఆ రోజున ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఓ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి. ఆ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ‘చెన్నై లవ్ స్టోరీ’ని జూన్ 26న తీసుకురావాలనుకున్నాం.. అయితే అదే రోజున ‘పెద్ది’ వస్తోందని దర్శకనిర్మాత సాయిరాజేశ్ చెప్పారు. అందుకే త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. తన మాటలు నెట్టింట వైరల్ అవడంతో వెంటనే తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ‘పెద్ది’ జూన్ 26న విడుదలవుతోందని సోషల్ మీడియాలో ట్వీట్లు చూశాం. అందుకే ‘పెద్ది’ విడుదల విషయంలో క్లారిటీ వచ్చే వరకూ ఆగుదాం అని అనుకున్నాం. అలా ‘పెది’్ద సినిమా విడుదల విషయంలో నేను, సాయిరాజేశ్ పొరపడ్డాం. దీనిని తప్పుగా తీసుకోవద్దు’ అని తెలిపారు.
వాయిదా వేస్తారా?
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. షూటింగ్ పార్ట్ ఇంకా కొంత మిగిలి ఉండడంతో ఈ నెల 30న థియేటర్లలోకి తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, రామ్‌చరణ్ కంటికి అయిన గాయం కావడం వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలిసింది. అయితే కంటికి చిన్న సర్జరీ చేయించుకుని ఆ మర్నాడే రామ్‌చరణ్ షూటింగ్‌కు హాజరుకావడంతో జనానికి సందేహాలు తొలగిపోయి, అనుకున్న సమయానికే ‘పెద్ది’ వస్తుందని ఫిక్స్ అయ్యారు. సినిమాకి ఇక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దాన్ని రామ్‌చరణ్, జాన్వీ పై చిత్రీకరిస్తే సినిమాకు గుమ్మడి కాయ కొట్టేయ్యచ్చు. ఆ తర్వాతే అసలు కథ ఉంది.
ఇది పాన్ ఇండియా సినిమా కనుక అన్ని భాషల్లో పర్‌ఫెక్ట్‌గా డబ్బింగ్ చెప్పించి, ప్రమోషన్ కూడా గట్టిగా చేసి తర్వాత రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుదన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. దీనికి నెల రోజుల సమయం సరిపోదు కనుక డైరెక్ట్‌గా విడుదల వాయిదా విషయాన్ని నిర్మాతలు చెప్పకుండా ఇతరులతో లీక్ చేయిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే ‘పెద్ది’ విడుదల వాయిదా పడుతుందనే విషయం మీద ఇంత చర్చ జరుగుతున్నా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా నిర్మాతలు మౌనం పాటిస్తున్నారని కొందరి కామెంట్. ఓ నాలుగైదు వారాల టైమ్ తీసుకుని ఆ తర్వాత విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
ఆ రోజు రాకుంటే నష్టమెంత?
మార్చి 26న విడుదల కాలేకపోవడంతో ఇప్పటికే వేసవి సీజన్ ఆరంభాన్ని.. శ్రీరామ నవమి లాంగ్ వీకెండ్‌ను ‘పెద్ది’ మిస్ అయ్యింది. అయినా ఆ రోజు వాయిదా వేసి ఈ నెల 30న రిలీజ్ చేయాలన్నది మంచి ఆలోచనే. ఆ సమయానికి పీక్ సమ్మర్ ఉండడంతో ప్రేక్షకులు కూడా కుటుంబసమేతంగా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే మే డే, లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చేది.
అదే స్లాట్‌కు భారీ పోటీ
పెద్ది విడుదల విషయంలో ఓ క్లారిటీ వస్తే తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేయొచ్చనేది చిన్న చిత్రాలతో సిద్ధంగా ఉన్న నిర్మాతల ఆలోచన. అలాగే వాయిదా ప్రభావం ఇతర మీడియం రేంజ్ హీరోల చిత్రాలపైనా పడుతోంది. ఇప్పటికే ‘పెద్ది’ కోసం తన రాకను వాయిదా వేసుకొంది ‘లెనిన్’ చిత్రం. ఒకవేళ ‘పెద్ది’ చిత్రం అనుకున్న సమయానికి రాలేకపోతే ‘లెనిన్’ విడుదలను మేకర్స్ ముందుకు తెస్తారేమో చూడాలి.
మరోవైపు పెద్ది స్లాట్‌పై పలు చిత్రాలు కన్నేశాయి. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాకపోతే అదే రోజు తమ సినిమాలను తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందులో ‘మా ఇంటి బంగారం’, స్వయంభూ’, ‘గాయపడ్డ సింహం’. ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ లాంటి చిత్రాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘పెద్ది’ సినిమా నిజంగా వాయిదా పడిందా? వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.