Jagapathi Babu: ‘పెద్ది’ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవుతుంది.. చరణ్ ప్రతి షాట్ సిక్సర్
ABN, Publish Date - Jun 02 , 2026 | 12:21 PM
‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలుస్తుందని, రామ్ చరణ్ ప్రతి షాట్ సిక్సర్‌లా ఉంటుందని అన్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ వేదికపై
జగపతి బాబు (Jagapathi Babu) మాట్లాడుతూ: నమస్తే విజయవాడ. నేను 1962లో బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజినీ దేవి హాస్పిటల్‌లో పుట్టాను. అప్పట్లో అది బెజవాడ. నేను మీతో పాటు పెరిగిన వాడిని. మీతో పాటే ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టానన్నది ఎంత వాస్తవమో, ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనేది కూడా అంతే వాస్తవం.
పెద్ది మరో స్థాయికి వెళ్లిపోయే సినిమా. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. అందరి ఆకలి, దాహం తీర్చే సినిమా ఇది. నాకు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర దక్కింది. ‘పెద్ది’లో నేను చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుంది. రామ్ చరణ్ గారి మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు. సినిమాలో ఆయన చేసిన ప్రతి షాట్ ఒక సిక్సర్‌లా ఉంటుంది. చరణ్ కేవలం విజయవంతమైన నటుడే కాదు, గొప్ప మనిషి కూడా. ఆయన మంచి మనసు, ఆప్యాయత ఆయన మాటల్లో, చూపుల్లో, పలకరింపులో కనిపిస్తాయి.
బుచ్చిబాబు అన్‌లిమిటెడ్ టాలెంట్ ఉన్న దర్శకుడు. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. రెహమాన్ గారికి నా సెల్యూట్. ఆయన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. జాన్వీ కపూర్ కూడా అద్భుతంగా నటించింది. రామ్ చరణ్ గారు, సతీష్ గారు నిర్మాణ సమయంలో ప్రతిరోజూ సెట్స్‌కి వచ్చి మాతో కలిసి ఉండేవారు. ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇలాంటి అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ‘పెద్ది’ నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా, ‘అప్పలసూరి’ నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుందని గర్వంగా చెబుతున్నాను అని ముగించారు.