అయ్యో.. రామ్ చరణ్ ఎంత పని చేశావ్! 'పెద్ది' కోసం.. అన్ని కోట్లు వదులుకున్నావా?
ABN, Publish Date - Jun 18 , 2026 | 06:37 PM
రామ్ చరణ్ కేవలం అద్భుతమైన నటుడిగానే కాకుండా తన విశాలమైన మనసుతో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కేవలం అద్భుతమైన నటుడిగానే కాకుండా తన విశాలమైన మనసుతో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాతలకు అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన పెద్ది (Peddi) చిత్రం విషయంలోనూ చరణ్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీసు వద్ద నిలకడగా కలెక్షన్లు రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ కి చేరువ కాగా, నిర్మాత సేఫ్ జోన్ లోకి వస్తున్నారనే టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ బిగ్గెస్ట్ విజయం వెనుక రామ్ చరణ్ పెద్ద మనసు కూడా ఉందని సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. ఈ చిత్రం కోసం చరణ్ దాదాపు రూ. 120 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని ప్రచారం జరగ్గా, అందులో సినిమా పూర్తయ్యాక తీసుకోవాల్సిన కొంత బకాయి మొత్తాన్ని ఆయన స్వీకరించకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ ఉదార నిర్ణయం నిర్మాతకు ఎంతో పెద్ద ఆర్థిక ఉపశమనాన్ని ఇచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
రామ్ చరణ్ అడుగుజాడల్లోనే నడుస్తూ దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) కూడా అగ్రిమెంట్ ప్రకారం తనకు రావాల్సిన పూర్తి పారితోషికాన్ని తీసుకోకుండా కొంత మొత్తాన్ని వదులుకుని నిర్మాతకు మరింత ఆర్థిక భారాన్ని తగ్గించారట. ఒకే సినిమాకు పనిచేసిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇలా నిర్మాత శ్రేయస్సు కోసం తమ రెమ్యునరేషన్లు త్యాగం చేయడం చిత్ర పరిశ్రమలో సరికొత్త చర్చకు దారితీసింది. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి, మెగా అభిమానుల నుంచి ప్రశంసల జల్లు కురిపిస్తోంది.
సినిమా హిట్టయినా ఫ్లాపయినా తామున్నామంటూ భరోసా ఇచ్చే హీరోలు టాలీవుడ్ లో చాలా అరుదుగా ఉంటారని నెటిజన్లు కొనియాడుతున్నారు. "బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డుల కన్నా తమను నమ్మి కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత క్షేమమే అత్యంత ప్రధానమని భావించే అసలైన రియల్ హీరో మన చరణ్" అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. కష్టకాలంలో వెనకడుగు వేయకుండా అండగా నిలిచే ఈ అద్భుతమైన లక్షణమే చరణ్‌ను మిగతా స్టార్ల కంటే ఎంతో భిన్నంగా నిలబెడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్‌కి ఎదిగినా కూడా తన పాత విలువలను, ఇండస్ట్రీ బాగును కోరుకునే వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రామ్ చరణ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అంటున్నారు.