Chiru Vs Rajini: రజనీ- చిరు 'డబుల్ క్లాష్'పై సర్వత్రా నెలకొన్న ఆసక్తి
ABN, Publish Date - Aug 16 , 2026 | 10:30 AM
మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ రజనీకాంత్ నడుమ బాక్సాఫీస్ వార్ సాగనుంది. అది ఒకసారి కాదు రెండు సార్లు జరగనుందని టాక్.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)నడుమ బాక్సాఫీస్ వార్ సాగనుంది. అది ఒకసారి కాదు రెండు సార్లు జరగనుందని టాక్. ఈ 'డబుల్ క్లాష్' క్రమంలో ఇటు టాలీవుడ్ లో చిరు - అటు కోలీవుడ్ లో రజనీ ఇతర టాప్ స్టార్స్ తో పోటీపడ్డ వైనాన్ని గుర్తు చేసుకుందాం.
డబుల్ క్లాష్'పై సినీ ఫ్యాన్స్ ఫోకస్...
రజనీకాంత్ 'జైలర్-2' చిత్రం అక్టోబర్ 15న విడుదలవుతూండగా, చిరంజీవి 'విశ్వంభర' సినిమా ఆ మరుసటి రోజునే జనం ముందుకు వస్తోంది. ఈ దసరా సీజన్ పోటీ తరువాత పొంగల్ బాక్సాఫీస్ వార్ లోనూ రజనీకాంత్, చిరంజీవి మరోమారు తలపడనున్నారని టాక్. అప్పుడు చిరంజీవితో బాబీ తెరకెక్కిస్తోన్న 'కదిరి నరసింహుడు'తో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తోన్న 'ధర్మన్' ఢీ కొంటుందని వినికిడి. అలా చిరు-రజనీ బాక్సాఫీస్ వార్ రెండు సార్లు సాగనుండటం సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ - కోలీవుడ్ సూపర్ స్టార్ మధ్య పోటీ కావడం వల్ల ఇతర చిత్రసీమల్లోనూ వీరి సినిమాలపై సినీజనం ఫోకస్ పెట్టారు.
చిరుపై రజనీ పైచేయి...
చిరంజీవి, రజనీకాంత్ సినిమాలు ఒకే రోజున రిలీజైన సందర్భాలు ఇంత వరకూ లేవు. అయితే ఒకే ఒక్కసారి వీరిద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. ఆ బాక్సాఫీస్ వార్ 2023లో చోటు చేసుకుంది. అప్పుడు ఆగస్టు 10న రజనీకాంత్ 'జైలర్' రిలీజ్ కాగా, మరుసటి రోజునే ఆగస్టు 11న చిరంజీవి 'భోళాశంకర్' జనం ముందు నిలచింది. రజనీకాంత్ 'జైలర్' బంపర్ హిట్ అనిపించుకుంది. అందువల్లే ఈ సారి 'జైలర్-2' ముందు 'విశ్వంభర' ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్ లో ఉంది.
చిరుకు జయాపజయాలు...
తెలుగునాట చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కూడా టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్నారు. ఈ ముగ్గురితో చిరంజీవి పలుమార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. అయితే ఈ ముగ్గురితోనూ ఒకేరోజున చిరంజీవి పోటీపడిన సందర్భాలున్నాయి. వీరిలో అందరికంటే ముందుగా వెంకటేశ్ తో చిరంజీవి ఢీ కొనడం విశేషం. 1988 జనవరి 14న చిరంజీవి 'మంచిదొంగ', వెంకటేశ్ 'రక్తతిలకం' విడుదలయ్యాయి. 'మంచిదొంగ' కొన్ని ఏరియాల్లో పైచేయి సాధిస్తే, 'రక్తతిలకం' మరికొన్ని చోట్ల ఆధిక్యత చాటుకుంది. తరువాత 2001 జనవరి 11న బాలకృష్ణ 'నరసింహనాయుడు'తో చిరంజీవి 'మృగరాజు' పోటీ పడింది. బాలయ్య 'నరసింహనాయుడు' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. 2022 అక్టోబర్ 5వ తేదీన చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ఘోస్ట్' చిత్రాలు రిలీజయ్యాయి. రెండూ పరాజయం పాలయినా, 'గాడ్ ఫాదర్' అత్యధిక వసూళ్ళు చూసింది. అలా తన తరం హీరోలతో ఒకేరోజు పోటీపడి జయాపజయాలు చూశారు చిరంజీవి.
రజనీ హవా...
తమిళనాట రజనీకాంత్ కు సమవుజ్జీ అంటే కమల్ హాసన్ అనే చెప్పాలి. వారిద్దరూ పలుమార్లు బాక్సాఫీస్ వార్ లో ఢీ కొన్నారు. అయితే ఒకే రోజున వారి చిత్రాలు విడుదలైన సందర్భాలు రెండే రెండుసార్లు ఉన్నాయి. 1987 అక్టోబర్ 21న కమల్ హాసన్ 'నాయకన్'తో రజనీకాంత్ 'మనిదన్' పోటీ పడింది. 'మనిదన్' బాక్సాఫీస్ ను షేక్ చేసినా, 'నాయకన్' డీసెంట్ హిట్ తో పలు అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. ఇక 2005 ఏప్రిల్ 14న మరోమారు వీరిద్దరూ బాక్సాఫీస్ బరిలో తలపడ్డారు. రజనీకాంత్ 'చంద్రముఖి'- కమల్ హాసన్ 'ముంబై ఎక్స్ ప్రెస్' ఆ దఫా పోటీకి దిగాయి. 'చంద్రముఖి' సూపర్ డూపర్ హిట్ గా నిలచింది.
ఆ ఇద్దరికీ మధురానుభూతి...
ఇప్పటి వరకు ఏ చిత్రసీమలోనూ చోటు చేసుకోని ఓ అరుదైన సంఘటన కమల్- రజనీ నటజీవితాల్లో జరిగింది. 1979 ఏప్రిల్ 14న రిలీజైన 'నినైతలే ఇనిక్కుమ్', 'తాయిల్లమల్ నాన్ ఇల్లై' చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లోనూ కమల్ హాసన్, రజనీకాంత్ నటించడం విశేషం. రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. 'తాయిల్లమల్ నాన్ ఇల్లై'లో కమల్ హీరోకాగా, రజనీ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా ఇద్దరు నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రావడం వారిద్దరికీ ఓ మధురానుభూతిగా నిలచింది. ఇన్నాళ్ళకు మళ్ళీ రజనీకాంత్- కమల్ హాసన్ కలసి నటించడం వారి అభిమానులకు ఆనందం పంచుతోంది. అలాగే రజనీకాంత్ తో కమల్ హాసన్ నిర్మిస్తోన్న 'ధర్మన్' కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాతోనే చిరంజీవితో బాబీ తీసే చిత్రం సంక్రాంతి బరిలో ఢీ కొననుందని టాక్. మరి రజనీ-చిరు బాక్సాఫీస్ వార్ ఏ తీరున సాగుతుందో చూడాలి.