Varanasi Vs Ramayana: జగత్ జెట్టీలు.. ఒకదాన్ని మించి మరోటి! ఎక్కడా తగ్గడం లేదుగా
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:02 AM
భారతీయ సినిమా గమనాన్ని మార్చే దిశగా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. అవే రామాయణ ఇంకా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి.
భారతీయ సినిమా గమనాన్ని మార్చే దిశగా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. అవే రామాయణ (Ramayana) ఇంకా రాజమౌళి (Rajamouli) ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi). ఈ రెండు సినిమాలు కూడా ఐమ్యాక్స్ వెర్షన్లలో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతుండటం గమనార్హం. ఇప్పటివరకు ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్ ఫుటేజ్ పెద్దగా బయటకు రాకపోయినప్పటికీ, సినీ ప్రియుల్లో వీటిపై ఉన్న అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇప్పటివరకు 'వారణాసి' నుంచి ఒక మోషన్ టీజర్, 'రామాయణ' నుంచి ఒక అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రమే విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ అలాగే ఆడియో ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడమే. ఇందుకోసం నిర్మాతలు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో అని చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణ తెరకెక్కుతుండగా.. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్ (Yash), హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. అటు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి సుమారు రూ. 1,300 కోట్లతో తెరకెక్కుతోంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా (Priyanka chopra) కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమార్ ( Prithviraj Sukumaran) ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పరంగా చూస్తే 'వారణాసి' ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తున్నా, మరొక కీలక విషయంలో 'రామాయణ' పైచేయి సాధించిందని చెప్పవచ్చు. ఇటీవల కొన్ని ప్రముఖ థియేటర్లలో, ముఖ్యంగా డాల్బీ సినిమాస్ వెర్షన్లలో ఈ రెండు చిత్రాల టీజర్లు ప్రదర్శితమయ్యాయి. ఈ క్రమంలో 'రామాయణ' అందించిన విజువల్ ట్రీట్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఒక చిన్న టీజర్‌తోనే ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుందట. 'రామాయణ' సినిమాకు ప్రధాన బలం ఏంటంటే.. దీనిని 3D ఫార్మాట్‌లో ప్లాన్ చేయడం. ఒకవేళ 'వారణాసి' లాగే ఇది కూడా కేవలం 2Dకి పరిమితమై ఉంటే టాక్ మరోలా ఉండేదేమో. కానీ, ఈ సినిమా మోషన్ టీజర్‌ను 3Dలో అనుభూతి చెందిన వారు మాత్రం దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని సమాచారం. విజువల్ క్వాలిటీ విషయంలో 'రామాయణ' ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతోందని ఈ స్పందన ద్వారా స్పష్టమవుతోందంట.
ఈ పరిణామాల నేపథ్యంలో 'రామాయణ' టీజర్ కలిగించిన ఇంపాక్ట్ 'వారణాసి' కంటే ఒక మార్కు ఎక్కువే సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో జక్కన్న తన 'వారణాసి' చిత్రాన్ని కూడా 3Dలో అనౌన్స్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు చిత్రాలు భారతీయ సినిమా సత్తాను ప్రపంచ వేదికపై ఏ స్థాయిలో నిలబెడతాయో వేచి చూడాలి. ఇదొక అద్భుతమైన సినీ ప్రయాణమని ప్రతి ఒక్కరికీ అవగతమవుతోంది.