RRR: టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే

ABN , Publish Date - Aug 13 , 2026 | 02:19 PM

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలోఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో వేడుక మొత్తం అభిమానుల సందడితో మార్మోగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు (RRR) చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

“రవితేజ నాకు కజిన్‌. చిన్నప్పటి నుంచే సినిమాలంటే అతడికి ఎంతో ఇష్టం. స్టార్‌ హీరో కావాలనే సంకల్పంతో ఎవరి అండదండలు లేకుండా తన సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగాడు. అందుకే రవితేజ నాకు కేవలం హీరో మాత్రమే కాదు.. మా ప్రాంతానికి గర్వకారణం. మా జిల్లాకు చెందిన వ్యక్తి మాస్‌ మహారాజాగా ఎదిగి, ఇప్పుడు ఇదే గడ్డపై తన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది” అని రఘురామ కృష్ణరాజు అన్నారు. భీమవరం వేదికగా ‘ఇరుముడి’ ట్రైలర్‌ విడుదల కావడం తనకు మరింత ప్రత్యేకమైన విషయమని ఆయన పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో, తనకు ఎంతో సన్నిహితమైన రవితేజ సినిమా వేడుక జరగడం ఒక మెమొరబుల్‌ మూమెంట్‌ అని చెప్పారు. ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉందని, ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. 


పశ్చిమ గోదావరి జిల్లాకు ఉన్న సినీ ప్రత్యేకతను కూడా ఆయన గుర్తుచేశారు. “తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కృష్ణా, గుంటూరు ప్రాంతాల ప్రభావం ఎక్కువగా కనిపించేది. కానీ మన పశ్చిమ గోదావరి గడ్డ కూడా ఎంతోమంది గొప్ప హీరోలను తెలుగు సినిమాకు అందించింది. కృష్ణంరాజు, ప్రభాస్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రవితేజ వంటి ఎంతోమంది అగ్ర నటులతో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నిజానికి మన ప్రాంతం నుంచి వచ్చిన నటులు తమ ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారని చెప్పుకోవడం గర్వంగా ఉంది. వారి విజయాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి'  పేర్కొన్నారు.

‘ఇరుముడి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక కేవలం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంగానే కాకుండా.. పశ్చిమ గోదావరి గడ్డకు, అక్కడి సినీ వారసత్వానికి సంబంధించిన ప్రత్యేక వేడుకగా మారింది. రవితేజపై రఘురామ కృష్ణరాజు చేసిన ప్రశంసలు, మన ప్రాంతం నుంచి వచ్చిన స్టార్‌ హీరోలను గుర్తుచేసిన తీరు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.  

Updated Date - Aug 13 , 2026 | 02:19 PM