Rag Mayur: జాతీయ వేదికపై మెరిసిన తెలుగు నటుడు
ABN, Publish Date - Jul 20 , 2026 | 05:30 PM
తెలుగు నటులు కేవలం ప్రాంతీయ స్థాయికే పరిమితం కావడం లేదు. సహజ నటన, బలమైన పాత్రల ఎంపికతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెలుగు నటులు కేవలం ప్రాంతీయ స్థాయికే పరిమితం కావడం లేదు. సహజ నటన, బలమైన పాత్రల ఎంపికతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి యువ నటుల్లో ఒకరైన రాగ్ మయూర్ (Rag Mayur) తాజాగా జాతీయ వేదికపై మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ముంబైలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్' వేడుకలో ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సివరపల్లి'లో రాగ్ మయూర్ పోషించిన పాత్ర ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రలో నటన, భావోద్వేగాలను తీరు జ్యూరీని ఆకట్టుకోవడంతో ఈ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, బోమన్ ఇరానీ, దర్శక ద్వయం రాజ్ & డీకే తదితరులతో కలిసి రాగ్ మయూర్ ఒకే వేదికను పంచుకోవడం విశేషం. తెలుగు నటుడిగా జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు దక్కడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కథ బలంగా ఉండి, నటన హృదయాలను తాకితే భాష అనేది అడ్డంకి కాదని రాగ్ మయూర్ సాధించిన విజయం నిరూపించింది. రాగ్ మయూర్ సాధించిన ఈ విజయం వ్యక్తిగత విజయమే కాదని, తెలుగు కంటెంట్, తెలుగు నటుల ప్రతిభకు జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవానికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.