పది రోజులకే రూ. 51 కోట్లు.. బాక్సాఫీసును షేక్ చేస్తున్నపెద్దావిడ చిన్న సినిమా
ABN, Publish Date - Mar 10 , 2026 | 07:39 AM
స్టార్స్ నటిస్తున్న చిత్రాలే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘తాయి కిళవి’ సంచలనం సృష్టిస్తోంది.
స్టార్స్ నటిస్తున్న భారీ చిత్రాలే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఒక చిన్న సినిమాగా విడుదలై, పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 51. 16 కోట్లు (గ్రాస్) వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా పేరు ‘తాయి కిళవి’ (Thaai Kizhavi). రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar) తన ఆకారాన్ని పూర్తిగా మార్చుకుని పక్కా తమిళనాడు నేటివిటి గెటప్ ధరించి ఈ సినిమాలో నటించారు.
రూ. తొమ్మిది కోట్ల బడ్జెట్‌లో తయారైన ‘తాయి కిళవి’ అంచనాలకు మించి వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 2026లో ఇప్పటివరకూ విడుదలైన తమిళ చిత్రాల్లో రూ. 84.75 కోట్లు వసూలు చేసి ‘పరాశక్తి’ చిత్రం మొదటి స్థానంలో నిలవగా, ఫిబ్రవరి 27న రిలీజ్ అయిన ‘తాయి కిళవి’ సినిమా రెండో స్థానంలో చేరింది. సరైన సినిమా లేకపోవడం, విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల ఎప్పుడనేది ఇతమిద్ధంగా తెలియకపోవడం ‘తాయి కిళవి’కి కలసి వచ్చింది.
63 ఏళ్ల వయసులో రాధిక పోషించిన ఈ ఊర మాస్ పాత్ర, ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టు కుంటున్నాయి. కరుమత్తూర్ గ్రామంలో ఉంటూ ఉక్కు మహిళగా పేరొందిన పవును త్తాయి పాత్రలో రాధిక ఒదిగిపోయిన విధానం, ఆ గెటప్ లో మేకప్ కోసం గంటల తరబడి కష్టపడిన పద్ధతి అభినందనీయం అంటున్నారు ప్రేక్షకులు. డబ్బు పై ఆశ కలిగిన మహిళగా, చివరకు సొంత పిల్లలను కూడా తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి చేసే కఠిన ప్రయత్నాలు రాధికను పవును త్తాయి పాత్రలో కొత్తగా పరిచయం చేశాయి.
తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నిర్మించిన ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకత్వం వహించారు. రాధిక కోసమే ఈ సినిమా చూడాలి అనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో అతి త్వరలోనే ఈ ‘తాయి కిళవి’ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.