కీరవాణి రాత.. చంద్రబోస్ కూత అదిరింది! కొత్త అంత్యాక్షరి పాట
ABN, Publish Date - Jul 06 , 2026 | 08:09 PM
చాలా రోజుల తర్వాత ఓ సరదా తెలుగు పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ పాట విన్నవారు, చూసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత ఓ సరదా తెలుగు పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ పాట విన్నవారు, చూసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు కారణం ఇప్పటికే ప్రపంచ యవనికపై విజయ పతాకం ఎగుర వేసి దేశ కీర్తిని ఇనుమడింప జేసిన ఇద్దరు ఉద్దండులు తమ నేపథ్యాలను మార్చుకుని చేసిన ఈ ప్రయోగం వీక్షకులకు, శ్రోతలకు కనులారా శ్రవణానందం కలిగిస్తోంది. వారేవరో కాదు ఆస్కార్ గ్రహీతలు ఒకరు సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి మరొకరు సినీ గేయ రచయిత చంద్రబోస్.
తాజాగా వీరిరువురు తమ పంథా మార్చుకుని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కీరవాణి (Keeravani) ఓ పాటను రచించగా చంద్రబోస్ స్వయంగా ఆ పాటను ఆలపించి నటించడం విశేషం. ఈ వీడియోలో చంద్రబోస్ (Chandra Bose), గాయని లిప్సిక (Lipsika) ఇద్దరు క్యారమ్స్ ఆడుతూ అంత్యాక్షరి పోటీని పెట్టుకుంటారు. క్యారమ్స్ బోర్డుపై కాయిన్స్ వేస్తూ.. ఆట ముగిసే అక్షరంతో పాటలు పాడాల్సి ఉంటుంది.
ఈ పోటీలో భాగంగా లిప్సిక తన కెరీర్‌లో చంద్రబోస్ ఎవరికి ఎక్కువ పాటలు రాశారని ప్రశ్నించగా.. ఆయన 'కీరవాణి' అని, ఇంట్లో అన్ని విషయాల్లో ఎవరు బాస్ అన్న ప్రశ్నకు చంద్రబోస్ తన భార్య ‘సుచి’ (సుచిత్ర) పేరిట పాట అందుకుంటారు. ఈ విధంగా సాగిన వీరి సరదా సంభాషణ, పాటల పోటీ సరికొత్తగా సాగుతుంది. చివరగా ఒక విచిత్రమైన పరిస్థితిలో లిప్సిక ఔట్ కావడంతో ఈ సరదా మ్యూజిక్ వీడియో ముగుస్తుంది. రాసింది కీరవాణి.. కూసింది చంద్రబోస్ (RAASINDI KEERAVAANI KOOSINDI CHANDRABOSE) పేరిట విడుదలైన ఈ కాన్సెప్ట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.