పూరి జగన్నాథ్.. హర్డిల్స్ దాటేనా! స్లమ్ డాగ్.. రిలీజ్ అయ్యేనా?

ABN , Publish Date - Apr 18 , 2026 | 10:07 AM

ఒకప్పుడు తన సినిమాలతో యూత్ ను ఓ ఊపు ఊపేశారు పూరీ జగన్నాథ్. ఆయన మూవీ వస్తోందంటే చాలు కిర్రిక్కిపోయేవారు జనం. అలాంటి పూరి తాజా సినిమా రిలీజ్ కావడానికి కొన్ని హర్డిల్స్ ఎదురవుతున్నాయి. ఏంటో అవి?

Puri Jagannadh

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా 'స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్ (Slumdog) మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ దశ ముగించుకుంది. రీ-రికార్డింగ్ కూడా సాగుతోందని సమాచారం. అయినా ఇప్పటి దాకా చిత్ర నిర్మాతలయిన పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అందుకు వారి ముందున్న సమస్యలు ఏవంటే - అంతకు ముందు పూరి రూపొందించిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాల పరాజయం తాలూకు లెక్కలు. 'లైగర్' మూవీని దాదాపు 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. కొనుగోలు దారుల నుంచీ మేకర్స్ బాగానే రాబట్టారు. అయితే 'లైగర్' బాక్సాఫీస్ వద్ద పెట్టుబడిలో కనీసం సగం కూడా పోగేయలేక పోయింది. దాంతో బయ్యర్స్ తమ లాస్ ను ఎలాగైనా భర్తీ చేయమని పూరి టీమ్ ను కోరారు. అందుకు రాబోయే 'డబుల్ ఇస్మార్ట్ ' ఉందని హామీ ఇచ్చారు మేకర్స్.

'డబుల్ ఇస్మార్ట్'కు ముందు రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' బంపర్ హిట్ గా నిలచింది. ఆ క్రేజ్ తో 'డబుల్ ఇస్మార్ట్' కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని ఆశించారు బయ్యర్స్. అయితే 'డబుల్ ఇస్మార్ట్' మరింత ఘోరంగా పరాజయం పాలయింది. అలా 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో నష్టపోయిన వారు తమ నష్టాన్ని భర్తీ చేస్తేనే కానీ, పూరి సినిమాలను రిలీజ్ కానివ్వమంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో పూరీ పాత చిత్రాలను రీ-రిలీజ్ కూడా అడ్డుకుంటామనీ కొందరు అన్నారు... ఏదేమైనా పూరి గత రెండు చిత్రాల భారీ నష్టాలు ప్రస్తుత చిత్రం 'స్లమ్ డాగ్'కు అడ్డంకిగా మారాయి.

పూర్వ వైభవం వచ్చేనా...!?

విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్, సంయుక్త నటించిన 'స్లమ్ డాగ్'కు పూరి పాత బాకీలు అడ్డంకి అయ్యాయి సరే!. మరి రిలీజ్ చేయడం ఎలా?. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' లాస్ పై 'తెలుగు ఫిలిమ్ ఛాంబర్' లో పంచాయితీ పెండింగ్ లో ఉంది. ఇక తెలంగాణ ఫిలిమ్ ఎగ్జిబిటర్స్ కూడా పూరిపై నష్టాల భర్తీ విషయమై కేసు పెట్టారు. అందువల్ల 'స్లమ్ డాగ్' రిలీజ్ పై మేకర్స్ పెదవి విప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో 'స్లమ్ డాగ్' డిజిటల్ రైట్స్ బిజినెస్ కూడా సాగడం లేదు. పేరున్న ఓటీటీ సంస్థలతో ఛార్మీ చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. అది సవ్యంగా సాగితే ముందుగా 'లైగర్' నష్టాలను భర్తీ చేస్తామని, 'స్లమ్ డాగ్' రిలీజ్ తరువాతే 'డబుల్ ఇస్మార్ట్' లాస్ పై చర్చిస్తామని పూరి అంటున్నారట. ఈ హర్డిల్స్ దాటగానే 'స్లమ్ డాగ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్. ఈ మూవీ రిలీజ్ తరువాత పూరి జగన్నాథ్ కు పూర్వవైభవం వస్తుందేమో చూడాలి.

Updated Date - Apr 18 , 2026 | 10:07 AM