షూటింగ్ చేశారు.. ప్రమోషన్ మరిచారు! ఇంతకు సినిమా ఉందా లేదా పూరీ
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:38 PM
పూరి జగన్నాథ్ కొత్త సినిమా అంటేనే అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. అలాంటిది విజయ్ సేతుపతి వంటి విలక్షణ నటుడితో ‘స్లమ్ డాగ్’ ప్రాజెక్ట్ ప్రకటించగానే అంచనాలు అమాంతం పెరిగాయి. కానీ షూటింగ్ వేగంగా పూర్తి చేసిన ఈ చిత్రం ప్రమోషన్స్ విషయంలో మాత్రం సైలెంట్ అవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినీ ప్రస్థానంలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్‌ల చుట్టూ నెలకొన్న సస్పెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ప్రకటించిన 'స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్ (Slumdog) చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు, సేతుపతి నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని అందరూ భావిస్తున్నారు. అనౌన్స్ చేసిన తక్కువ కాలంలోనే ఈ సినిమా హైప్‌ను సంపాదించుకుంది.
పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మీ కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ (Samyuktha) హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'యానిమల్' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
సాధారణంగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను మొదలుపెట్టారంటే అది జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. షూటింగ్ పనులన్నీ చకచకా పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ దశకు కూడా చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కానీ, అంత స్పీడ్‌గా పనులు జరిపిన చిత్ర యూనిట్, ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి పూరి జగన్నాథ్ స్టైల్ అంటేనే ఒక పక్కా ప్లానింగ్‌తో ఉండటం. సినిమా మొదలైనప్పుడే రిలీజ్ డేట్‌ను లాక్ చేయడం, దానికి తగ్గట్టుగానే టీజర్లు, గ్లింప్స్‌లను వదలడం ఆయన అలవాటు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? గ్లింప్స్ ఎందుకు ఆలస్యం అవుతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ సినిమా విడుదలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా అవుట్‌పుట్ విషయంలో ఏవైనా మార్పులు చేస్తున్నారా లేక ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. పూరి జగన్నాథ్ మళ్లీ తన మునుపటి ఫామ్‌ను అందుకోవాలని కోరుకునే అభిమానులు మాత్రం, త్వరలోనే టీం నుంచి ఒక గట్టి క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. మరి ఈ 'స్లమ్ డాగ్' ఎప్పుడు గర్జిస్తుందో వేచి చూడాలి!.