Gottimukkala Padma Rao: గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
ABN, Publish Date - Jun 21 , 2026 | 05:25 PM
సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య పేరు విజయలక్ష్మీ. వారికి సుజనారావు, సుష్మారావు, సుచరితారావు ముగ్గురు సంతానం. 1996లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పద్మారావు. ఆ సమయంలో జన్మభూమి కాలనీ పేరిట పేదలకు ఇళ్ళు కట్టించడంతోపాటు పలు అభివద్థి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసి, పార్టీ బలోపేతానికి కృషిచేశారు.
2014లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. గొట్టిముక్కల పద్మారావు సినీ నిర్మాత కూడా. పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్‌పై సుమన్‌తో ‘కంచు కవచం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన పోలీసు పాత్ర పోషించారు. 1986లో సి.ఎన్‌రావు దర్శకత్వంలో శ్రీ వేమన చరిత్ర చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు. 1991లో వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ఏప్రిల్ 1 విడుదల, 1993లో జోకర్ వంటి చిత్రాలను నిర్మించారు. పద్మారావు కుమార్తె సుజనా రావు ‘గమనం’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. పద్మారావు మరణవార్త తెలుసుకున్న సినీ రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.