ప్రేమంటే.. సినిమా పైరసీపై కేసు! చెన్నై థియేటర్‌లో.. రికార్డింగ్ చేసినట్లు గుర్తింపు
ABN, Publish Date - Sep 11 , 2026 | 07:43 AM
థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘ప్రేమంటే’ సినిమాను అక్రమంగా చిత్రీకరించి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఘటనపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది.
ఇటీవల విడుదలైన ప్రేమంటే (Premante) సినిమా థియేటర్లలో ప్రసారం అవుతుండగా అక్రమంగా చిత్రీకరించి పైరసీ సైట్లలో పెట్టారన్న ఫిర్యాదుపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎన్బీ) అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ మనీంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని సీఎస్బీ అధికారులు తెలిపారు. చెన్నైలోని లక్స్ థియేటర్‌లో ప్రేమంటే సినిమాను అక్రమంగా క్యామ్ రికార్డింగ్ చేశారని, ఆ తర్వాత 5 మూవీ రూల్జ్ (Movierulz), 1తమిళ్ ఎంవి వంటి పైరసీ సైట్లలో అందుబాటులోకి తీసుకుని వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్యూబ్ సినిమా టెక్నాలజీస్ వారు ఈ పైరసీపై ప్రాథమిక విచారణ జరిపి పైరసీ కాపీ లక్స్ ఫీనిక్స్ మార్కెట్ సిటీలో రికార్డు అయ్యిందిగా గుర్తించారని, గత ఏడాది నవంబర్ 21న సాయంత్రం 5.15 నుంచి 7.15వరకు క్యామ్ రికార్డింగ్ జరిగినట్లుగా తెలిపారని వారు ఫిర్యాదులో వివరించారు. ఈ పైరసీ సినిమాను అడ్డం పెట్టుకుని పాప్ అప్, ప్రకటనల ద్వారా అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నారని, చిత్రీకరణకు పాల్పడిన వారితో పాటు ఆన్లైన్ కాపీని పెట్టి యువతను నిషేదిత బెట్టింగ్ వైపు నెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు పిర్యాదులో పేర్కొన్నారు.