మహాకాళి.. జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న ప్రశాంత్ వర్మ
ABN, Publish Date - Jul 14 , 2026 | 08:38 PM
ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథాలజికల్ ఎపిక్ చిత్రం మహాకాళి (MahaKali) చివరి షెడ్యూల్ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది.
ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథాలజికల్ ఎపిక్ చిత్రం మహాకాళి (MahaKali) చివరి షెడ్యూల్ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాతో భూమిశెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుండగా.. అక్షయ్ ఖన్నా,రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన భూమి శెట్టి మహాకాళి ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇక ఈ చిత్రం షూటింగ్ పరంగా మరో కీలక మైలురాయిని కూడా విజయవంతంగా దాటింది. తాజాగా మహాకాళి సినిమా 125 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను తాజాగా పూర్తి చేసుకోగా.. శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా కూడా ఇప్పటికే తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రేక్షకులకు సరికొత్త, అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ సినిమాను భారీ స్థాయిలో ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో మిళితం చేస్తూ భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మైథాలజికల్ మూవీగా మహాకాళి రూపుదిద్దుకుంటోంది. పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న చివరి షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.