Prakash Raj: దేశంలో రాజకీయాలు నడుస్తోందే కటౌట్స్ మీద!
ABN, Publish Date - Jul 05 , 2026 | 12:04 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై తరచూ విమర్శల ట్వీట్లు వేస్తుంటారు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఆయన్ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై (APDCM Pawan Kalyan) తరచూ విమర్శల ట్వీట్లు వేస్తుంటారు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj). తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఆయన్ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. ‘నాకు, ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి వైరం లేదు. జనసేన ప్రారంభమైన మొదటి రోజుల్లో నాకు ఆయనపై అనేక ఆశలు ఉండేవి. ఆ తర్వాత ఆయన ఒక కూటమితో పొత్తుపెట్టుకున్నారు. గతంలో మేమిద్దరం నటించిన ఒక షూటింగ్ సమయంలో ఆయన నాతో- ‘మీరు చాలా బాగా మాట్లాడతారు. కొన్ని కారణాల వల్ల నేను వారితో వెళ్లాల్సి వస్తే.. అప్పుడు నేను మీకు వ్యతిరేకం అవుతానేమో. దానికి మీరు సిద్థంగా ఉండండి’ అని ఆయనే చెప్పారు. ఆ తర్వాత ఆయన ఐడియాలజీ మారిపోయింది. ఆయన ఐడియాలజీకి నేను వ్యతిరేకిని. ఆయన తీసుకొనే నిర్ణయాలను నేను ఒక పౌరుడిగా ప్రశ్నిస్తా. దానికి సమాధానం చెప్పకుండా నన్ను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. నా నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. నేను ఈ బెదిరింపులకు భయపడేవాడిని కాదు’ అని అన్నారు.
మతం రంగు పూస్తున్నారు..
ఈ రోజు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ‘నమ్మకం కోల్పోవడం’.. నేతల మీద, వ్యవస్థల మీద నమ్మకం పోయింది. మతానికి పెద్ద పీట వేస్తున్నారు. చివరకు క్రికెట్‌లో కూడా మతాన్ని తెచ్చేస్తున్నారు. ఒక ముస్లిం ఆటగాడు మ్యాచ్‌లో వికెట్లు తీయకపోతే చాలు.. అతడిని పాకిస్థానీ అని, కావాలనే వాళ్లకి అనుకూలంగా ఆడాడంటూ దేశద్రోహి ముద్రలు వేసేస్తున్నారు. ఒకప్పుడు మహమ్మద్ రఫీ పాడుతుంటే అందరూ మైమరచి వినేవారు. అప్పుడు ఆయన జాతిగానీ, మతంగానీ చూడలేదు. షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ సూపర్‌స్టార్లు అయినప్పుడు దేశ ప్రజలు వారి మతాన్ని చూడలేదు. కానీ ఇప్పుడు కొందరు ప్రతీ దానికి మతం రంగు పూస్తున్నారు.
ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారని అడగలేదు..
దేశంలో రాజకీయాలు నడుస్తున్నదే ఫేసెస్, కటౌట్స్ మీద! సామాన్యుడు ఇక్కడ ప్రధానమంత్రి ఎన్నుకోడు. కానీ, ‘‘ఈ ముఖం చూసి ఓటేయండి’’ అని నాయకులే చెబుతారు. ఉదాహరణకు విజయ్ లాంటి వాళ్లు ‘నా కటౌట్ చూసి ఓటేయండి’ అంటారు. పవన్ కల్యాణ్ ‘నన్ను చూసి మీ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించండి’ అంటారు. అంటే ప్రజల ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలి కదా! ప్రశ్న అడిగినప్పుడు అది వ్యక్తిగతం ఎందుకు అవుతుంది? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి దూరి ప్రశ్నలు సంధించలేదు. నేను ఎవరినీ ‘నువ్వు ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నావు?’ అని అడగలేదు. వాళ్ల అలవాట్లు, తిండి, వేసుకునే దుస్తుల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది వారి వ్యక్తిగతం. నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ‘అడగానికి నువ్వెవరు?’, ‘నీ వెనుక ఎవరున్నారు’ అని ఎదురు ప్రశ్నిస్తారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఎలా అవుతుంది? జవాబుదారీతనం ఎలా అవుతుంది? మహేశ్‌బాబు, ఎన్టీఆర్, చరణ్, రజనీకాంత్, విజయ్‌లాంటి పెద్ద హీరోలతో పనిచేయడం వల్ల... వాళ్లతో పాటు నాకు కూడా స్టార్‌డమ్ వచ్చింది. ప్రకాశ్‌రాజ్ ఒక్కడే నటిస్తే సినిమా హిట్ అవ్వదు. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్ కాంబినేషన్స్ మాత్రమే ఇక్కడ పనిచేస్తాయి.
వాస్తవిక సమాజంలో బతుకుతున్నా
నేను నా ప్రతిభ వల్ల మాత్రమే ఈ స్థాయికి రాలేదు. ప్రేక్షకుల ప్రేమ వల్ల కూడా నేను ఎదిగాను. వాళ్లు మనల్ని గుర్తించకపోతే మనం ఎక్కడ ఉంటాం? అయితే నేను కేవలం ఒక గాజు భవంతిలోనో, సినీ మాయా ప్రపంచంలోనో బతకడం లేదు. వాస్తవిక సమాజంలో బతుకుతున్నా. నా చుట్టుపక్కల అన్యాయం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడే- ‘నేను బతికి ఉన్నాను, నేను కూడా మనిషిని’ అని నాకు అనిపిస్తుంది. అందరినీ మెప్పించడానికి నేను బతకడం లేదు. నేను ఏదో కోల్పోతున్నానని చూసేవాళ్లు.. నేను ఏం పొందానో కూడా చూడాలి కదా! ప్రతీది కోల్పోవడానికి నేనేమీ పిచ్చివాడిని కాదు. ఒకవైపు ఏదైనా కోల్పోతే, సమాంతరంగా నేను మరొకటి పొందుతున్నాను. దానివల్ల నాకు కలిగే ఆనందం.. ‘నువ్వు అన్నీ కోల్పోతున్నావు’ అని వాపోయేవాళ్లకు బహుశా అర్థం కాకపోవచ్చు.
వాంగ్‌చుక్‌తో నేను ఈ మధ్యనే సుదీర్ఘంగా సంభాషించా! ఆయన నీట్ పరీక్ష ప్రక్రియలోని అన్యాయాల గురించి మాత్రమే మాట్లాడడం లేదు... మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాడు. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. వ్యవస్థలపై రాజకీయ పార్టీలు, నాయకులు పెడుతున్న ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాడు. పిల్లల భవిష్యత్తు ఏమయిపోతుందో అనే భయంతో మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తిపై ‘టెర్రరిస్ట్’ అనే ముద్ర వేయటం కన్నా అన్యాయం ఇంకేమి ఉండదు.