ప్రభాస్ స్పిరిట్.. మరో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ను దింపుతున్న సందీప్ రెడ్డి వంగా
ABN, Publish Date - May 25 , 2026 | 08:25 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న ‘స్పిరిట్’ పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఇమేజ్, మరొకవైపు ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ వంగా మేకింగ్ స్టైల్.. ఈ రెండూ కలవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ మొదలవ్వగా, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న కొన్ని క్రేజీ అప్‌డేట్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. '
ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని రీతిలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన లుక్ అత్యంత రగ్గడ్, వైల్డ్, ఊరమాస్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.ఈ సినిమాలో కాస్టింగ్ పరంగా ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సందీప్ రెడ్డి కేవలం హీరో పాత్రనే కాకుండా, కథను మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన, ప్రత్యేకమైన క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట. ఈ పాత్ర కోసం బాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ సీనియర్ నటుడిని రంగంలోకి దించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ముద్ర పడనప్పటికీ, ఒకవేళ ఆ సీనియర్ యాక్టర్ కనుక ప్రాజెక్ట్‌లోకి వస్తే సినిమా స్థాయి ఎక్కడికో వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదట.
ఈ ఊహాగానాలే ఇప్పుడు ‘స్పిరిట్’ తారాగణంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్నాయి. అయితే, ఈ క్రేజ్ వెనుక ట్రేడ్ విశ్లేషకుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ‘సాహో’ నుంచి మొదలుపెట్టి ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’, ‘ది రాజా సాబ్’ వరకు గత కొన్ని చిత్రాలలో ప్రభాస్ తన పూర్తి నటన సామర్థ్యాన్ని చూపించే అవకాశం రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలామంది దర్శకులు ఆయన భారీ కటౌట్, స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన విజువల్ ఆరాని నమ్ముకుని కథలు రాశారే తప్ప, ఆయనలోని అసలైన నటుడిని వంద శాతం వాడుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. కథలో దమ్ము లేనప్పుడు, కేవలం ప్రభాస్ ఇమేజ్ మీదే నడిపించాలని చూసినప్పుడు గతంలో కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి.
సరిగ్గా ఇక్కడే సహాయ నటుల ప్రాధాన్యత ఎంత అనేది స్పష్టమవుతోంది. ఇటీవల ప్రభాస్ సాధించిన బ్లాక్‌బస్టర్ విజయాలను గమనిస్తే.. బలమైన కథతో పాటు పక్కన నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఉన్నప్పుడే మ్యాజిక్ రిపీట్ అయింది. ఉదాహరణకు ‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ పాత్ర, ‘సలార్’లో పృథ్వీరాజ్ సుకూమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. హీరో చుట్టూ అంతటి హేమాహేమీలు ఉన్నప్పుడే డ్రామా పండుతుందని, కేవలం వన్-మ్యాన్ షోగా సినిమాను వదిలేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.
ఈ బలహీనతను గమనించే సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ కోసం ఒక పక్కా వ్యూహాత్మకమైన కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ యాక్షన్ డ్రామాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ వంటి విలక్షణ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా ఒక పవర్‌ఫుల్ కేమియో రోల్‌లో మెరవబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక సరికొత్త ఇంటెన్స్ వరల్డ్‌ను క్రియేట్ చేయడంలో సందీప్ సిద్ధహస్తుడు. ప్రభాస్ మాస్ పవర్, దర్శకుడి మార్క్ మేకింగ్, తోడుగా తోపు నటుల అండ.. ఇవన్నీ చూస్తుంటే ‘స్పిరిట్’ బాక్సాఫీస్ ను శాసించడం ఖాయంగా కనిపిస్తోంది.