సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రభాస్ వెంటే రికార్డులు.. దేశంలో తొలిసారి వెయ్యి కోట్లు చూసిన హీరో!

ABN, Publish Date - Feb 23 , 2026 | 05:51 PM

ఆల్ ఇండియాలో కొన్ని అరుదైన రికార్డులకు కారణమయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన గ్రాండ్ సక్సెస్ లో డైరెక్టర్స్‌దే కీలక పాత్ర అంటున్నారు కొందరు. కాదు, ప్రభాస్ సొంత స్టామినా కూడా ఉందని మరికొందరి మాట. ఇంతకూ ఏమిటి సంగతి!?

Prabhas

మన దేశంలో మొట్టమొదట వెయ్యి కోట్లు చూసిన హీరోగా ప్రభాస్ (Prabhas) చరిత్రలో నిలచిపోయారు. రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన 'బాహుబలి- ద కంక్లూజన్' (Bahubali) చిత్రం మన దేశంలో వెయ్యి కోట్లు చూసిన ప్రప్రథమ చిత్రంగా నిలచింది. ఈ మూవీ టోటల్ రన్‌లో రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి ఈ నాటికీ చెక్కుచెదరని రికార్డ్‌తో వెలుగుతోంది. ఈ మూవీ రిలీజయిన కొన్నాళ్ళకు అంతకు ముందు రికార్డ్‌గా ఉన్న ఆమిర్ ఖాన్ (Aamir Khan) 'దంగల్' విదేశాల్లో విజయకేతనం ఎగురవేసి రెండువేల కోట్లు పోగేసిందని నార్త్ ట్రేడ్ పండిట్స్ అన్నారు. అదెంత వసూలు చేసినా, ఓ ఇండియన్ మూవీ తొలిసారి వెయ్యి కోట్లు చూసింది మాత్రం ప్రభాస్ 'బాహుబలి - ద కంక్లూజన్'తోనే అందరూ అంగీకరిస్తారు. అయితే ఈ క్రెడిట్ ప్రభాస్‌కు దక్కదని, అది పూర్తిగా డైరెక్టర్ రాజమౌళి సొంతమని చాలారోజులుగా టముకు సాగింది. రాజమౌళి సినిమా కాకుండా ప్రభాస్ వెయ్యి కోట్లు సాధించగలరా? అన్న మాట కూడా వినిపించింది. ఆ మాటలకు ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఎ.డి.' (Kalki 2898 A.D.) చెక్ పెట్టింది.


'బాహుబలి - ద కంక్లూజన్' తరువాత వచ్చిన ప్రభాస్ చిత్రాలు 'సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్' సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో ప్రభాస్‌కు రాజమౌళి లేకుంటే గ్రాండ్ సక్సెస్ సున్నా అన్నవారూ లేకపోలేదు. ఆ సమయంలో ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్-1' మంచి విజయం సాధించి, దాదాపు 600 కోట్లు చూసింది. అయితే ప్రభాస్‌కు వెయ్యికోట్లు ఇప్పట్లో రావు అన్న మాటలు భలేగా చక్కర్లు కొట్టాయి. 'సలార్' రిలీజయిన ఆరు నెలలకే ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడి' విడుదలయింది. ఈ సినిమా వెయ్యికోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ప్రభాస్‌పై విమర్శలు గుప్పించేవాళ్ళ నోళ్ళు మూతబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఆ నోళ్ళు పెగలుతున్నాయి. 'ద రాజాసాబ్' (The Raja Saab) డిజాస్టర్ కావడం వల్లే ప్రభాస్‌పై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయినా ప్రభాస్ మాత్రం తాను అదరక బెదరక ముందుకు సాగుతూనే ఉన్నారు. పైగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.


ప్రస్తుతం ఆల్ ఇండియాలో సీక్వెల్స్ హీరోగా సాగనున్నది ప్రభాస్ ఒక్కరే అని చెప్పవచ్చు. ఆయన ప్రస్తుతం 'ఫౌజీ' (Fauzi), 'స్పిరిట్' (Spirit) చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాగానే కల్కి, సలార్' సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధిస్తే 'సీక్వెల్స్'లో ఇప్పటికే 'బాహుబలి' సిరీస్‌తో గ్రాండ్ సక్సెస్ చూసిన ప్రభాస్ 'హ్యాట్రిక్' సొంతం చేసుకుంటారు. ఈ కోణంలో చూస్తే ఇంతటి అరుదైన ఘనత ఏ ఇండియన్ స్టార్‌కూ దక్కదనీ పరిశీలకుల మాట. ముందు 'ఫౌజీ', 'స్పిరిట్' పూర్తి కావాలి, తరువాత సీక్వెల్స్ రావాలి అప్పుడు చూద్దాం అసలు కథ అంటున్నారు సినీ ఫ్యాన్స్. ఏది ఏమైనా ప్రభాస్‌కు సొంత స్టామినా ఉందని ట్రేడ్ టాక్. అంతేకాదు ప్రభాస్ 'సీక్వెల్ స్టార్'గానూ జేజేలు అందుకుంటారనే పరిశీలకుల మాట! మరి ఏమవుతుందో చూడాలి.

Updated Date - Feb 23 , 2026 | 07:12 PM