'బాహుబలి-3'నా లేక మరో కొత్త అద్భుతమా..!
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:43 PM
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ - డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కాంబో మరోమారు రిపీట్ కానుందట. వింటూంటేనే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కనుంది.
రెబల్ స్టార్ గా ఫ్యాన్స్ ను అలరిస్తోన్న ప్రభాస్ ను ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా నిలిపారు రాజమౌళి. అంతకుముందు కేవలం స్టార్ గానే ఉన్న ప్రభాస్ ను రాజమౌళి తన 'ఛత్రపతి' సినిమాతో క్రేజీ స్టార్ ను చేసేశారు. ప్రభాస్ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చిత్రంగా ఈ నాటికీ 'ఛత్రపతి' నిలచే ఉంది. ఇక 'బాహుబలి' సిరీస్ తో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ కు గుర్తింపు లభించింది. అలాంటి రాజమౌళి- ప్రభాస్ కాంబోలో మరో సినిమా వస్తోందంటే అభిమానులకే కాదు ప్రేక్షకులకు ఆసక్తి కలగకుండా ఉంటుందా. మరి ప్రభాస్- రాజమౌళి కాంబోలో మరో సినిమా తెరకెక్కేది ఎప్పుడు? అభిమానులందరినీ ఇదే ప్రశ్న తొలుస్తోంది. ఇక ప్రభాస్ తో రాజమౌళి తీసే సినిమా ఏమై ఉంటుంది. అప్పుడెప్పుడో ప్రభాస్, రానా, అనుష్క కలసి ఉన్న ఓ వీడియోలో 'బాహుబలి-3' ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రభాస్ తో రాజమౌళి తీయబోయేది 'బాహుబలి-3' నేనా అన్న చర్చ కూడా సాగుతోంది.
ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యమవుతోందని అందువల్ల ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7న కాకుండా మహేశ్ బర్త్ డేకి విడుదల అవుతుందని అంటున్నారు. ఆపై రాజమౌళి ఫ్రీ అవుతారు... కానీ, ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కావలసి ఉంది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందిన 'ఫౌజీ' తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ మూవీ తరువాత ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న 'స్పిరిట్' విడుదల కానుంది. ఈ చిత్రాల తరువాత అంతకు ముందు ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడి', 'సలార్' చిత్రాల సీక్వెల్స్ లో నటించాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయ్యే సరికి తప్పకుండా 2028 అవుతుందని తెలుస్తోంది. కాబట్టి ఆ తరువాతే ప్రభాస్ తో రాజమౌళి సినిమా ఉంటుందని టాక్.
వచ్చే యేడాది 'వారణాసి' చిత్రాన్ని రిలీజ్ చేశాక, రాజమౌళి ప్రభాస్ కోసం రెండేళ్ళు ఖాళీగా ఎటూ ఉండరు. తాను తెరకెక్కించబోయే తరువాతి ప్రాజెక్ట్స్ కు సంబంధించిన స్క్రిప్ట్స్ ను జక్కన్న సిద్ధం చేసుకుంటారు. 'వారణాసి' తరువాత జక్కన్న రూపొందించబోయేది 'మహాభారతం' అని మొన్నటి దాకా వినిపించింది. బహుశా, ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటారేమో!. ప్రభాస్ మాత్రం తాను కమిట్ అయిన అన్ని సినిమాలను పూర్తి చేశాక, రాజమౌళికి బల్క్ డేట్స్ ఇస్తారని వినికిడి. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. కాబట్టి ప్రభాస్ కంటిన్యూగా డేట్స్ ఇచ్చినా, రాజమౌళి ఆ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేసినా 2030 కావచ్చని లెక్కలు వేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా రాజమౌళి- ప్రభాస్ సినిమా అనగానే అప్పుడే అభిమానుల్లో ఆసక్తి మొదలయింది. మరి ప్రభాస్- రాజమౌళి కాంబోలో మరో మూవీ ఎప్పుడు? ఎలా పట్టాలెక్కుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?
బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా
ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు