Allu Arjun: పుష్పనా.. మజాకా! బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో.. అల్లు అర్జున్?
ABN, Publish Date - Feb 01 , 2026 | 08:12 PM
ఒక గొప్ప ఆలోచన వచ్చినప్పుడు దానిని అమలు చేసే సమయం చాలా కీలకమని ఒక ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చెప్పారు.
ఒక గొప్ప ఆలోచన వచ్చినప్పుడు దానిని అమలు చేసే సమయం చాలా కీలకమని ఒక ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చెప్పారు. సరైన సమయంలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించకపోతే, ఆ అవకాశం చేజారిపోవడమే కాకుండా అదే కాన్సెప్టుతో మరొకరు సినిమా చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా (Rakeysh Omprakash Mehra) కలయికలో రావాల్సిన ‘కర్ణ’ (Karna) సినిమా పరిస్థితి కూడా ఇలాగే మారుతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దాదాపు ఐదారేళ్లు శ్రమించి ‘కర్ణ’ స్క్రిప్టును సిద్ధం చేశారు. దీనిని రెండు భాగాలుగా, సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే, సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ సమీకరణాలు మారిపోయాయి. అంత పెద్ద మొత్తం సూర్య మార్కెట్‌పై పెట్టడం రిస్క్ అని భావించిన ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణ సంస్థ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇక మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన కర్ణుడి పాత్రను వెండితెరపై విజువల్ గ్రాండియర్‌గా చూపించాలని దర్శకుడు రాకేష్ పట్టుదలతో ఉన్నారు. కానీ బడ్జెట్ తగ్గించి సినిమా నాణ్యతను దెబ్బతీయడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే కథ, నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకుండా ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ‘హోల్డ్’లో ఉంచారు. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఆరు పాటలను సిద్ధం చేసినా, ప్రస్తుత పరిస్థితుల వల్ల సినిమా ఆగిపోయిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా ట్రెండ్ పీక్స్‌లో ఉంది. ఇప్పటికే పలువురు దిగ్గజ దర్శకులు మహాభారత గాథలను వెండితెరపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో ‘కర్ణ’ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైతే ఆ కాన్సెప్ట్ పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. వేరే ఇతర సినిమాలు రాకముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తేనే దానికి తగిన గుర్తింపు, వసూళ్లు దక్కుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ సూర్యతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లని పక్షంలో, రాకేష్ మెహ్రా దృష్టి సౌత్ ఇండియాకు చెందిన ఇతర స్టార్ హీరోలపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న ప్రభాస్ (Prabhas) లేదా అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రమే ఈ భారీ బడ్జెట్‌కు న్యాయం చేయగలరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు నటించినా సినిమాకు తిరుగులేని బిజినెస్ జరుగుతుంది. కాకపోతే ప్రభాస్ ఇప్పటికే ‘కల్కి’లో కర్ణుడి ఛాయలున్న పాత్ర చేయడంతో, అల్లు అర్జున్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సూర్య పేరుతో ప్రచారంలో ఉంది. ఒకవేళ హీరోను మార్చాలని దర్శకుడు భావిస్తే, దానికి సూర్య అంగీకారం లేదా ఇతర సాంకేతిక కారణాలు ఏమైనా అడ్డు వస్తాయా అనేది చూడాలి. ప్రస్తుతం సూర్య తన 44వ, 45వ సినిమాలపై దృష్టి సారించగా, ‘కర్ణ’ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఈ భారీ విజువల్ వండర్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, చివరికి ఏ హీరో కర్ణుడిగా కనిపిస్తాడో వేచి చూడాల్సిందే.