ప్రభాస్ ‘ఫౌజీ’.. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మధ్య పోలికలేంటి?
ABN, Publish Date - Oct 24 , 2026 | 05:54 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఫైల్ నెం.25’ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మరో సినిమా పేరు తెరపైకి వచ్చింది. అదే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’. ఈ రెండు చిత్రాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ఆయన లుక్, కథకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పరిచయం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన కూడా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దేశం కోసం పోరాడే తిరుగుబాటు సైనికుడిగా, వ్యూహకర్తగా, గూఢచారిగా ప్రభాస్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, భగవద్గీత ఆధారంగా రూపొందించిన ఒక రహస్య కోడ్ అంశం కూడా గ్లింప్స్‌లో ప్రస్తావనకు రావడంతో కథపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాతో ఈ సినిమాను పోల్చి ట్రోల్ చేస్తున్నారు. బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందిన ‘డెవిల్' 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో కళ్యాణ్ రామ్ గూఢచారి పాత్రలో కనిపించారు. త్రివర్ణ అలియాస్ డెవిల్‌గా ఆయన చేసిన పాత్రకు రహస్య కార్యకలాపాలు, గూఢచర్యం, దేశభక్తి వంటి అంశాలు ప్రధాన బలంగా నిలిచాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యానికి సంబంధించిన అంశాలు కూడా ‘డెవిల్’ కథలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ఫౌజీ’లోనూ నేతాజీ ప్రస్తావన, సైనికుడి పాత్ర, గూఢచర్యానికి సంబంధించిన అంశాలు కనిపించడంతో కొందరు ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తున్నారు.
పోలికలు ఉన్నంత మాత్రాన కథ ఒక్కటేనా?
‘ఫౌజీ’, ‘డెవిల్’ చిత్రాల్లో చారిత్రక నేపథ్యం, గూఢచర్యం, దేశభక్తి వంటి అంశాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశాలు కనిపించినంత మాత్రాన రెండు సినిమాల కథలు ఒకటేనని చెప్పలేం. వాటి కథనం, పాత్రల రూపకల్పన, సంఘర్షణ, దర్శకులు ఎంచుకున్న కథా పద్ధతులు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది.