ఫౌజీ వాయిదా.. ప్రభాస్ కే ఎందుకిలా
ABN, Publish Date - Sep 09 , 2026 | 03:52 PM
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తోన్న చిత్రాలలో ఫౌజీ ఒకటి.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తోన్న చిత్రాలలో ఫౌజీ (Fauzi) ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి కథానాయికగా పరిచయం కాబోతోంది. 1940ల కాలం నాటి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపిస్తుండగా, ఇప్పటికే టాకీ పార్ట్‌తో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రత్యేక సెట్స్‌లో భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ కూడా శరవేగంగా జరిగింది. మొదట మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేయడానికి అధికారికంగా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, ఫౌజీ అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాకపోవచ్చు అనే వార్తలు సినీ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఇంకా కీలకమైన భారీ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్, వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో మేకర్స్ అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి తొందరపాటు పడకూడదని భావిస్తున్నారట. అందుకే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు చిత్రాన్ని డిసెంబర్ స్లాట్ నుంచి వాయిదా వేయాలని చూస్తున్నట్లు టాక్. ఈ వాయిదా వల్ల సినిమా ఏకంగా డిసెంబర్ నుంచి ఒక నెల వెనక్కి జరిగి, సంక్రాంతి రేసులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ప్రభాస్ ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న సమయానికి రాలేదు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. బాహుబలి దగ్గర నుంచి రాజాసాబ్ వరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూ రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రభాస్ సినిమాలకే ఎందుకు ఇలా అవుతుంది అనేది తెలియడం లేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఫౌజీ ఖాళీ చేసిన డిసెంబర్ 3 రిలీజ్ డేట్‌ను దక్కించుకోవడానికి పలు మిడ్ రేంజ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. టాలీవుడ్‌లో ఇప్పటికే విశ్వక్ సేన్ లెగసీ ఇప్పటికే డిసెంబర్ 4 న వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాగ చైతన్య వృషకర్మ, అలాగే దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ చిత్రాల మేకర్స్ ఈ స్లాట్‌పై కన్నేశారని, ఆయా చిత్రాలను డిసెంబర్ రేసులో నిలిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయి అనేది చూడాలి.