Prabhas: పీపుల్ మీడియాను ఆదుకునే బాధ్యత ప్రభాస్‌దేనా?
ABN, Publish Date - Nov 02 , 2026 | 03:11 PM
‘ది రాజాసాబ్’ ఫెయిల్యూర్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆర్థికంగా బలమైన దెబ్బ తగిలింది. అంతకుముందు ‘ఆదిపురుష్’ పంపిణీ వ్యవహారం కూడా సంస్థపై కొంత ఆర్థిక భారాన్ని మోపింది.
‘ది రాజాసాబ్’ (The Raja Saab) ఫెయిల్యూర్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆర్థికంగా బలమైన దెబ్బ తగిలింది. అంతకుముందు ‘ఆదిపురుష్’ పంపిణీ వ్యవహారం కూడా సంస్థపై కొంత ఆర్థిక భారాన్ని మోపింది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa prasad) ఇప్పుడు ప్రభాస్‌తో (Prabhas) మరో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పీపుల్ మీడియా కోసం ఓ సినిమా చేస్తానని ప్రభాస్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా విశ్వప్రసాద్ పలువురు దర్శకులతో కథలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దర్శకుడు కరుణాకరన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ప్రభాస్, కరుణాకరన్ కలయికలో వచ్చిన ‘డార్లింగ్’ ప్రేక్షకులను అలరించింది.అందులో ప్రభాస్ లుక్, పాత్ర చిత్రణ, సంగీతం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందుకే వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తే బాగుంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. కరుణాకరన్ ఇప్పటికే ప్రభాస్‌కు ఓ కథ వినిపించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు ‘మిరాయ్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ప్రభాస్‌కు ఓ కథ చెప్పారని, ఆ కథకు హీరో సానుకూలంగా స్పందించారనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం కార్తీక్ ‘మిరాయ్ 2’ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలోనే తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రభాస్ సినిమా విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ ఇప్పుడున్న బిజీలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు ఆయన కోసం పలువురు అగ్ర దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పీపుల్ మీడియా కథను ప్రభాస్ ఎంచుకుంటారా? ఎవరికి అవకాశం దక్కుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.