పూజా హెగ్డే.. మరో స్పెషల్ సాంగ్! ఈ సారి.. అంతకుమించి
ABN, Publish Date - Apr 05 , 2026 | 11:36 AM
ఒకప్పుడు కేవలం హీరోయిన్లుగా మాత్రమే మెరిసిన తారలు, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో వెండితెరపై మంటలు పుట్టిస్తున్నారు.
ఒకప్పుడు కేవలం హీరోయిన్లుగా మాత్రమే మెరిసిన తారలు, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో వెండితెరపై మంటలు పుట్టిస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో కథానాయికలకు ఉన్న క్రేజ్ కన్నా, ఐటెం భామలకే డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్లు సైతం గ్లామర్ డోస్ పెంచి స్పెషల్ నంబర్లలో మెరవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే ఈ విభాగంలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, ఇప్పుడు ఆ ప్లేస్‌ను టార్గెట్ చేస్తూ దూసుకొస్తోంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde).
పూజా హెగ్డే అంటే కేవలం నటన మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్స్ కూడా అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణిగా ఆమె చేసిన సందడి ఫుల్ పాపులర్ అయింది. ఆ పాటతో బాక్సాఫీస్ వద్ద పూజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F3 చిత్రంలోనూ మెరిసి కుర్రకారును ఉర్రూతలూగించింది. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలోనూ ఆమె తన సత్తా చాటుతోంది.
గతేడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ చిత్రంలోని మోనిక సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట విడుదలైన క్షణం నుండే సోషల్ మీడియాను షేక్ చేసింది. దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఈ పాట ఒక రేంజ్‌లో ఊపేసింది. పూజా హెగ్డే తన గ్రేస్, ఎనర్జీతో ఆ సాంగ్‌కు ఒక ప్రత్యేకమైన వెయిట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, స్పెషల్ సాంగ్స్ విషయంలో మాత్రం పూజ పేరు మార్మోగిపోతోంది.
ఇక ఇప్పుడు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న తాజా వార్త ఏమిటంటే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా, రవి కిరణ్ కోల (Ravi Kiran Kola) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన చిత్రంలో పూజా హెగ్డే మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది. దీనికి సంబంధించిన కంపోజిషన్ కూడా పూర్తి అయిందని సమాచారం. త్వరలోనే భారీ సెట్టింగ్‌లో ఈ పాటను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మరోసారి జిల్ జిల్ జిగేల్ మంటూ సెట్‌లో మంటలు పుట్టించనుంది.
మరి ఈ పాట ఏ రేంజ్‌లో సినిమాకు హైప్ తీసుకొస్తుందో చూడాలి. ఒకవైపు లీడ్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో తన మార్కెట్‌ను స్థిరపరుచుకుంటోంది పూజా హెగ్డే. తమన్నా లాంటి సీనియర్ తారలకు గట్టి పోటీనిస్తూ, ఐటెం సాంగ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. మరి ఈ కొత్త ఇన్నింగ్స్‌తో పూజా హెగ్డే తన కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో వేచి చూడాలి.