‘జస్ట్ ఆస్కింగ్’ వల్లే ప్రకాష్ రాజ్‌కు కష్టాలు.. భార్య పోనీ వర్మ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 01 , 2026 | 03:29 PM
‘జస్ట్ ఆస్కింగ్’ వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్ సినిమా అవకాశాలు తగ్గాయని భార్య పోనీ వర్మ వెల్లడించారు.
విలక్షణ నటనతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ప్రతినాయకుడిగా, తండ్రిగా, కీలక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఆయనకు పరిశ్రమలో మంచి పేరుంది. అయితే ఇటీవల సినిమాల్లో ఆయన కనిపించక పోవడానికి కారణం ఆయన రాజకీయ అభిప్రాయాలేనని భార్య, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ (Pony Verma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సామాజిక, రాజకీయ అంశాలపై ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో ఆయన సంధించే ప్రశ్నలు తరచూ చర్చకు దారితీస్తుంటాయి. అయితే ఈ వైఖరి ఆయన వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపిందని పోనీ వర్మ వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్‌లో ఆలోచనా ధోరణి మారిందని, అప్పటి నుంచి సమాజంలో జరుగుతున్న పరిణామాలపై మరింత బలంగా స్పందించడం మొదలుపెట్టారని ఆమె వివరించారు.
రాజకీయ అంశాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయని పోనీ వర్మ తెలిపారు. అప్పటికే ఒప్పందం చేసుకున్న, అడ్వాన్సులు తీసుకున్న కొన్ని ప్రాజెక్టులు కూడా చేజారిపోయాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో దర్శక నిర్మాతలు పాత్రల కోసం ముందుగానే అడ్వాన్సులు చెల్లించినా, ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యవహార శైలిని కారణంగా చూపుతూ సినిమాల నుంచి తప్పించారని వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో ఇచ్చిన అడ్వాన్సులను కూడా వెనక్కి తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. సినిమా అవకాశాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లపైనా ఈ పరిణామాల ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రకాష్ రాజ్ మాత్రం ఏమాత్రం వెనకకు తగ్గడం లేదని తన మాటల పైనే నిలబడి ఉన్నాడని, తన అభిప్రాయాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరని పోనీ వర్మ స్పష్టం చేశారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించడం ఆయనకు ఇష్టం ఉండదని తెలిపారు. నటుడిగా సంపాదించిన గుర్తింపు, అవకాశాల కంటే తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. భర్త ఎదుర్కొంటున్న పరిస్థితులపై మొదట్లో ఆందోళన కలిగినా, ఆయన నమ్మిన విలువలకు కట్టుబడి తీసుకునే నిర్ణయాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని పోనీ వర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.