Prakash Raj: పవన్ ఆసరాతోనే.. మోదీ ప్రభుత్వం నడుస్తోంది
ABN, Publish Date - Aug 23 , 2026 | 06:26 PM
ప్రధాని నరేంద్రమోదీ సొంతంగా నిలవలేరని, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్ మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శించారు.
మహాప్రభువు నరేంద్రమోదీ (Narendra Modi) సొంత శక్తితో నిలవలేరని, అటూఇటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నితీశ్ కుమార్ (Nitish Kumar) భుజాల ఆసరాతో ఉన్నారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కి అంకితం చేసిన స్మారక సంపుటి కన్నడ వర్షన్ పుస్తకాన్ని శనివారం కలబురగిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని వికసిత్ భారత్ చేస్తానని చెబుతున్నారని, కానీ అధోగతివైపు తీసుకెళ్తున్నారని విమర్శించారు. మోదీ ఒక రాజులాగా జీవిస్తున్నారని, ఖరీదైన దుస్తులు, వైభవం, ఊరేగింపులు అవసరమా? అని ప్రశ్నించారు.
దేశ ప్రధాని సామాన్య ప్రజలకు చేరువగా ఉండాలన్నారు. రామ మందిరం పరిధిలోనే వారు ఓడిపోయారని, ఎంపీ, ఎమ్మెల్యేల కొనుగోలుకు రామమందిర డబ్బులను చోరీ చేశారని ఆరోపించారు. 'తీర ప్రాంతాలకు వెళ్లాలంటూ నన్ను కొందరు విమర్శిస్తున్నారు.. ఒకవేళ అక్కడి ప్రజలు సముద్ర చేప తిని, ఆలోచించి, ప్రశ్నించడం ప్రారంభిస్తే వీరి పరిస్థితి ఏమిటి? అబద్ధాలు. అవాస్తవాలు మాట్లాడే వారిని ముందుగా శుద్ధి చేయాలి. ఖర్గేకు మేం అండగా ఉంటాం. మోదీ అధికారం కోల్పోతారా? లేక దేశ ప్రజలే ఓడిస్తారా అనేది వేచి చూడాలి. భవిష్యత్తు ప్రధానిని మనమంతా కలసి ఎన్నుకుందాం' అని ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు.