'పిఠాపురంలో... అలా మొదలైంది' ఎప్పుడంటే...
ABN, Publish Date - Apr 09 , 2026 | 04:46 PM
మహేశ్ చంద్ర దర్శకత్వం వహించిన 'పిఠాపురంలో...' సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 1న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మహేశ్ చంద్ర తెలిపారు.
మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘పిఠాపురంలో … అలా మొదలైంది’. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మూడు విభిన్న ప్రేమ కథలతో ‘పిఠాపురంలో’ చిత్రాన్ని మహేశ్ చంద్ర తెరకెక్కించారని, యువత మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించారని, యువతతో పాటు తల్లిదండ్రులు సైతం చూడాల్సిన సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోందని వారు అన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తమ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. తన తొలి చిత్రం 'ప్రేయసి రావే' ఎంతటి గుర్తింపును, విజయాన్ని అందించిందో... అదే 'పిఠాపురంలో... ' సినిమాతో తిరిగి పొందుతాననే నమ్మకం ఉందని మహేశ్ చంద్ర అన్నారు.