‘పిఠాపురంలో.. అలా మొదలైంది’.. క్లైమాక్స్ సీన్‌కు కంటతడి పెట్టాల్సిందే!

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:52 PM

‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

Pithapuram Lo Ala Modalaindi Pre Release Event

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

అనంతరం సుమన్ మాట్లాడుతూ.. దర్శకుడు చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్ర మహేష్ యోగ్యుడైన దర్శకుడు. ఆయన మంచి వ్యక్తి. ఈ చిత్రంతో చంద్ర మహేష్‌కి మంచి విజయం దక్కాలని కోరారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. చంద్ర మహేష్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని నిర్మించిన దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలకు మంచి లాభాలు దక్కాలని అన్నారు.


డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నా 49 సంవత్సరాల సినీ జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. సి. నారాయణరెడ్డి కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. ఆ పాత్రలున్న సినిమాలు తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం. ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది. చంద్ర మహేష్ ఎలాంటి దర్శకుడో నాకు ముందు నుంచీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో వుండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. అందుకు నా హృదయపూర్వకంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లైమాక్స్ సీన్‌లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ వుంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో వున్నాయి. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దణ్ణంపెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాను థియేటర్‌కి వెళ్లి చూడండని కోరారు.


Suman.jpg

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకు మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ చాలా బాగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడండి.. అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనంత గిరి, దర్శకుడు రాం ప్రసాద్, దర్శకుడు సముద్ర, దర్శకుడు వీర శంకర్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి, దర్శకరచయిత బీవీఎస్ రవి, నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ, నిర్మాత ఆకుల సురేష్, నిర్మాత ఎఫ్.ఎం. మురళీ, నటి మణిచందన, సత్యం రాజేష్, కిరాక్ ఆర్పీ, నటుడు పృథ్వీ, నటుడు కేదార్ శంకర్, నటి శ్రీలు, నటుడు విరాట్, నటుడు సన్నీ వంటి వారంతా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న వస్తోన్న ఈ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్.. ట్విస్ట్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ ‘రాకా’ రిలీజ్‌ పై మళ్లీ సస్పెన్స్‌..!

ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సంచలనం.. టైమింగ్ అదిరింది

Updated Date - Sep 13 , 2026 | 04:52 PM