నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’
ABN, Publish Date - Nov 26 , 2026 | 05:16 PM
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలేల జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ సినిమా నవంబర్ 27న తెలుగు వెర్షన్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన మహోన్నత పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ఫూలే’. ప్రముఖ దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే హిందీలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ వెర్షన్లో నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. డా. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించగా, ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి సంభాషణలు అందించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. నవంబర్ 28, 2026న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, ఆశయాలు, సమాజం కోసం చేసిన పోరాటాన్ని మరింతమందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గురువారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు ప్రతీక్ గాంధీ హాజరయ్యారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు సురేష్ లాల్, నిర్మాత మధుర శ్రీధర్, నటుడు రచ్చ రవి, ఐఏఎస్ అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులంతా ‘ఫూలే’ చిత్రాన్ని అభినందిస్తూ, ఇది ప్రతి ఒక్కరిలోనూ సామాజిక చైతన్యాన్ని నింపే చిత్రమని, తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
నటుడు ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఇంతటి ముఖ్యమైన చిత్రానికి మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘ఫూలే’ వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించడం ఎంతటి సవాలో, వాటిని మరింతమంది ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కూడా అంతే పెద్ద బాధ్యత. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముందుకొచ్చిన డా. రవిచంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా జన్మస్థలం, పని ప్రదేశమైన పుణెకు, తెలంగాణ ప్రాంతానికి మధ్య ఎంతో సాంస్కృతిక అనుబంధం ఉంది. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200 ఏళ్ల క్రితం చేసిన గొప్ప కృషి ప్రభావం నేటికీ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. తరతరాలకు ఆయన ఆలోచనలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈరోజు మహిళలు ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తున్నారంటే, అందుకు ఫూలే దంపతులు వేసిన పునాదులు కూడా ఒక ముఖ్యమైన కారణం. అలాంటి మహనీయుల జీవితాన్ని, ఆశయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వంగా ఉంది' అని అన్నారు.
చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, 'ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించాం. ప్రతి మహిళ తప్పక చూడాల్సిన చిత్రమిది. ప్రేక్షకుల్లో ఆలోచనను, స్ఫూర్తిని కలిగించే గొప్ప కథతో ఈ సినిమా రూపొందింది' అని అన్నారు. సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ మాట్లాడుతూ, 'ఫూలే వంటి గొప్ప సందేశాత్మక చిత్రానికి సంగీతం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాను. ఇందులోని పాటలు ప్రేక్షకులందరికీ నచ్చుతాయని నమ్ముతున్నాను' అని అన్నారు. నిర్మాత 'మధుర' శ్రీధర్ మాట్లాడుతూ, 'ఇదొక అద్భుతమైన, ఆసక్తికరమైన కథ. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న మహనీయుల జీవితాన్ని ఇప్పుడు వెండితెరపైకి తీసుకురావడం అభినందనీయం. ఇలాంటి సినిమాలను చూడటం మన బాధ్యతగా భావించాలి. ఈ సినిమా ఆడియోను మధుర ఆడియో ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, 'మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం అద్భుతమైన కృషి చేసిన ఫూలే దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం ఎంతో సంతోషకరం. వారి ఆశయాలు, పోరాటం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరం' అని అన్నారు.