సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Srikanth: మూడు దశాబ్దాల 'పెళ్ళి సందడి'! ఈ రికార్డుల.. గురించి మీకు తెలుసా

ABN, Publish Date - Jan 12 , 2026 | 05:04 PM

మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'పెళ్ళి సందడి' సినిమా అప్పట్లో 30కి పైగా సెంటర్స్ లో వంద రోజులు ప్రదర్శితమైంది. విజయవాడ లో ఈ సినిమా ఏకంగా 301 రోజులు ఆడింది.

30 Years of Pelli Sandadi Movie

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 'పెళ్ళిసందడి'కి 30 ఏళ్ళు పూర్తయ్యాయి. అప్పట్లో 'పెళ్ళిసందడి' సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే సాగింది. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. పలు రికార్డులు నమోదు చేసింది. ఈ నాటికీ ఆ సందడి తలచుకోగానే జనం పులకించిపోతున్నారు.

సంక్రాంతి సినీసంబరాల కోసం ప్రేక్షకులు సదా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. 30 ఏళ్ళ క్రితం పొంగల్ బరిలో ఓ వైపు నటసింహ బాలకృష్ణ 'వంశానికొక్కడు' (Vamsanikokkadu), మరోవైపు కింగ్ నాగార్జున 'వజ్రం' (Vajram), ఇంకో వైపు విక్టరీ వెంకటేశ్ 'ధర్మచక్రం' (Dharma Chakram) చిత్రాలు ప్రేక్షకుల ముందు నిలిచాయి. బిగ్ స్టార్స్ మూవీస్ బరిలో ఉన్నా తనదైన రీతిలో వినోదం పంచే ప్రయత్నం చేసింది 'పెళ్ళిసందడి' (Pelli Sandadi) చిత్రం. 1996 జనవరి 12వ తేదీన రిలీజైన 'పెళ్ళిసందడి' సినిమాకు మొదట్లో 'బాగుంది' అన్న టాక్ వచ్చింది. పండగ సందడి తగ్గాక మెల్లగా 'భలేగుంది' అంటూ ప్రచారం మొదలయింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి రోజురోజుకూ జనాన్ని ఆకర్షిస్తూ 'పెళ్ళిసందడి' దూసుకుపోయింది. శ్రీకాంత్ కు స్టార్ స్టేటస్ సంపాదించి పెట్టింది ఈ సినిమా. నాయికగా రవళికి మరపురాని విజయాన్ని అందించింది. దీప్తి భట్నాగర్ కు తెలుగునాట ఓ వెలుగును చూపిందీ చిత్రం. వెరసి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది 'పెళ్ళిసందడి'.


'పెళ్ళిసందడి' చిత్రం చిన్నదే అయినా, కె.రాఘవేంద్రరావు (K. Raghavendra Rao), సి.అశ్వనీదత్, అల్లు అరవింద్ వంటి బిగ్ పర్సనాలిటీస్ కలయికలో రూపొందింది. శ్రీరాఘవేంద్ర మూవీ కార్పోరేషన్ పతాకంపై తెరకెక్కిన 'పెళ్ళిసందడి' చిత్రంలోని కథ చిన్నదే అయినా, దానిని రాఘవేంద్రరావు తన దర్శకత్వ మాయాజాలంతో మలచిన తీరు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. కీరవాణి స్వరకల్పనలో రూపొందిన తొమ్మిది పాటలూ జనాన్ని విశేషంగా అలరించాయి. వేటూరి, సీతారామశాస్త్రి, సామవేదం షణ్ముఖ శర్మ, జొన్నవిత్తుల, చంద్రబోస్ రాసిన పాటలు భలేగా మురిపించాయి. సత్యానంద్ సంభాషణలు సైతం జనాల్లో నాట్యం చేశాయి. ఇందులో భరణి, బాబుమోహన్, బ్రహ్మానందం, ఏవీయస్, శివాజీరాజా పండించిన కామెడీ కితకితలు పెట్టింది. అన్నీ అమరిన 'పెళ్ళిసందడి' అఖండ విజయం సాధించింది.

కొన్ని సార్లు అన్నీ అమరిన చిత్రాలు సాధించే విజయాలే వేరుగా ఉంటాయి. 'పెళ్ళిసందడి' ఘనవిజయం తరువాత జనం తమ పెళ్ళి బస్సులకు ఇది 'ఫలానావారి' పెళ్ళిసందడి అంటూ అతికించి మరీ సంబరపడ్డారు. ఈ సినిమాకు కొరియోగ్రఫీ కూడా నిర్వహించిన రాఘవేంద్రరావుకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గానూ, బెస్ట్ డైరెక్టర్ గానూ రెండు నంది అవార్డులు లభించాయి. కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకునిగానూ నంది బహుమతి దక్కింది. అలాగే ఉత్తమ సకుటుంబ సపరివార చిత్రంగానూ ఈ సినిమా నిలచింది. 30కి పైగా కేంద్రాలలో వందరోజులు, 23 సెంటర్స్ లో రజతోత్సవం చూసిన ఈ చిత్రం విజయవాడ స్వప్నలో ఏకధాటిగా 301 రోజులు ప్రదర్శితమయింది. అలా స్వర్ణోత్సవం చూసిన 'పెళ్ళిసందడి'ని ఈ నాటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 06:09 PM