సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అదనపు భారం మోయలేనంటూ.. ‘పెద్ది’ నిర్మాత లేఖ

ABN, Publish Date - Jun 17 , 2026 | 07:45 AM

తెలుగు సినీ పరిశ్రమలో పర్సంటేజ్‌ విధానం అమలుపై మరోసారి వివాదం చెలరేగింది. ‘పెద్ది’ నిర్మాత కిలారు వెంకట సతీశ్‌ రాసిన లేఖతో జూలై 3 నుంచి కొత్త విధానం అమలుపై సందిగ్ధత నెలకొంది.

Peddi Movie Percentage System

ఏళ్ల తరబడి సాగుతున్న వివాదానికి తెర పడింది, పర్సంటేజ్‌ విధానం ( Percentage System) కొలిక్కి వచ్చిందని ఇప్పటిదాకా చాలా మంది అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల పర్సంటేజ్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విధానం జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, సింగిల్ స్క్రీన్స్‌లో రెంటల్స్‌ ఉండవని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి నిర్ణయించారు.

ఈ విషయంపై స్పష్టత ఇస్తూ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ (Telugu Film Chamber) మే 27వ తేదీన ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. పర్సంటేజ్‌ విధానంపై సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ‘పెద్ది’ (Peddi Movie) నిర్మాత కిలారు వెంకట సతీశ్ (Venkata Satish Kilaru) కు ఒక లేఖ రాసింది. దీనితో వివాదం సమసి పోయిందని అందరూ భావించారు. ఎటువంటి వివాదాలు లేకుండా ‘పెద్ది’ సినిమా కూడా విడుదలైంది.

మళ్లీ మొదలు..

ఈ నేప‌థ్యంలో.. ‘పెద్ది’ నిర్మాత సతీశ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌కు లేఖ రాశారు. తాము లేకుండా ‘పెద్ది’కి సంబంధించిన నిర్ణయాలను తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ముందుగానే ‘పెద్ది’ బిజినెస్‌ పూర్తి కావడం, పంపిణీదారులతో ముందుగానే ఒక అంగీకారానికి రావడం వల్ల పర్సంటేజ్‌ విధానం తమ సినిమాకు ఆమోదయోగ్యం కాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తమపై అదనపు భారం మోపవద్దని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని, ఛాంబర్‌ను కోరినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

‘పెద్ది’ నిర్మాత రాసిన లేఖతో పర్సంటేజ్‌ వివాదం మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో జూలై 3వ తేదీ నాటికి సింగిల్ స్క్రీన్స్‌లో పర్సంటేజీ విధానం అమల్లోకి వస్తుందా? రాదా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ పర్సంటేజీ విధానాన్ని అమలు చేయడంలో తాను బాధ్యత తీసుకుంటానని చిరంజీవి (Chiranjeevi) హామీ ఇచ్చారని గతంలో ఎగ్జిబిటర్లు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను ఫిల్మ్‌ ఛాంబర్‌ పరిష్కరిస్తుందా? మళ్లీ చిరంజీవి జోక్యం చేసుకుంటారా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Updated Date - Jun 17 , 2026 | 09:06 AM