Payal Rajput: గ్లామర్ ను పక్కన పెట్టి ప్రయోగాలకు సిద్ధం..
ABN, Publish Date - May 03 , 2026 | 10:41 AM
కళ్లలో మెరుపు.. పెదవులపై చిరునవ్వు.. వెండితెరపై బోల్డ్ నటన.. ఇదీ మనం చూసే పాయల్ రాజ్‌పుత్. కానీ ఆ గ్లామర్ వెనుక ఒక సామాన్య అమ్మాయి పడిన ఆవేదన ఉంది.
కళ్లలో మెరుపు.. పెదవులపై చిరునవ్వు.. వెండితెరపై బోల్డ్ నటన.. ఇదీ మనం చూసే పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). కానీ ఆ గ్లామర్ వెనుక ఒక సామాన్య అమ్మాయి పడిన ఆవేదన ఉంది. అవకాశాల కోసం ఎదురుచూపులు.. ఆత్మీయుల దూరం.. ఒంటరి పోరాటం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాయల్ కన్నీరు పెట్టుకున్న తీరు ఆమెలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించింది.
సాధారణంగా సెలబ్రిటీల ఇంటర్వ్యూలంటే సినిమాల గురించి, గ్లామర్ గురించి సాగుతాయి. కానీ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ప్రశంసలతో మొదలై, కన్నీళ్లతో ముగిసింది. ఆమె మేధస్సును, నైపుణ్యాన్ని ఇంటర్వ్యూయర్ మెచ్చుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గ్లామర్ ప్రపంచంలో నటీమణుల లోపలి ప్రతిభను గుర్తించేవారు చాలా తక్కువమంది ఉంటారు. తన మనసులోని భావాలను ఏమాత్రం ఫిల్టర్ లేకుండా చెప్పే పాయల్.. ఆ మాటలకు ఫిదా అయ్యారు. ‘‘మీరు చేస్తున్న పాత్రల కంటే మెరుగైనవి రావాలని మీకు అనిపించడం లేదా?’’ అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఆమెలోని పరిణితిని తెలియజేసింది.
మూస పాత్రల ముద్ర
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన పాయల్.. ఆ తర్వాత అదే తరహా పాత్రలకు పరిమితం కావడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. ‘‘మనల్ని ఒకే రకమైన మూస పాత్రలకి పరిమితం చేస్తున్నప్పుడు మనం దానికి అలవాటు పడాలి. ఎందుకంటే నటులందరికీ అన్నింటిపై నియంత్రణ ఉండదు’’ అని ఆమె నిష్కర్షగా చెప్పారు. చిత్ర పరిశ్రమలో ఒక నటి జీవితం ఎంత కఠినంగా ఉంటుందో వివరిస్తూ.. ‘‘ఒక నటి ప్రతి రోజు అనిశ్చితితోనే నిద్ర లేస్తుంది. మాకు సరైన కాల్స్ వస్తాయా? రాబోయే మంచి అవకాశం కోసం ఇప్పుడున్న అవకాశాన్ని వదులుకోవాలా? ఒకవేళ వదులుకున్నాక అసలు అవకాశం రాకపోతే ఏం చేయాలి?’’ వంటి సందేహాల మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు.
తండ్రి మరణం
పాయల్ జీవితంలో గత ఏడాదిన్నర కాలం అత్యంత విషాదభరితమైనది. దాదాపు 8 నెలల కిత్రం క్యాన్సర్ కారణంగా తన తండ్రిని కోల్పోవడం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఆ విషయాల గురించి పంచుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘‘నా తండ్రి చివరి మాటలు నా చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతున్నాయి. ‘నువ్వు నీ కలలను వెంబడించాలి, ఇక్కడే ఆగిపోకూడదు. క్యాన్సర్ నన్ను తీసుకెళ్తోంది కానీ, నీపై నాకున్న ప్రేమను కాదు’ అని ఆయన చెప్పిన మాటలు నాలో మళ్లీ ధైర్యాన్ని నింపాయి’’ అని పాయల్ గుర్తు చేసుకున్నారు. ఆ బాధ నుంచి కోలుకుని ‘లీడర్’ వంటి సినిమాలతో కెరీర్‌ను తిరిగి ప్రారంభించారు.
తమిళ ఎంట్రీ
చాలాకాలం విరామం తర్వాత పాయల్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ‘లీడర్’ సినిమాతో అడుగుపెట్టారు. వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ నటించిన ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ తనదైన ముద్రవేశారు. ‘‘ఒక సినిమా హీరో చుట్టూ తిరగవచ్చు. అది తప్పు కాదు. కానీ ఆ సినిమా విజయం అందులో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తుంది’’ అని పరిణతితో సమాధానం ఇచ్చారు. తాను చాలా చిత్ర పరిశ్రమల్లో పనిచేశానని చెప్పిన పాయల్.. భాష రాకపోయినా ‘వన్‌టేక్’ కళాకారుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రతి పదం అర్థాన్ని రాసుకుని ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు. తెలుగులో ‘మంగళవారం’ అందించిన ఘన విజయం పాయల్ కెరీర్‌కు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం ఆమె తెలుగులోకి కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ప్రస్తుతం గ్లామర్‌ను పక్కనపెట్టి ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలకు కూడా ఆమె సై అంటున్నారు.
సోషల్ మీడియా ఒక ఆశ.
కొవిడ్ తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం కష్టంగా మారిన తరుణంలో సోషల్ మీడియా ఒక గొప్ప వేదికగా మారిందని పాయల్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ‘ఇంట్రావర్ట్’గా ఉన్న ఆమె ఇప్పుడు తన భావాలను సోషల్ మీడియా వేదికంగా పంచుకుంటున్నారు. ఇది పర్సనల్ గ్రోత్ కోసమే కాకుండా సినిమా ప్రమోషన్లకు కూడా ఎంతో అవసరమని చెప్పారు. సోషల్ మీడియాలో దొరికే ఆత్మీయత, వివిధ సంస్థలతో కొలాబరేషన్స్ ద్వారా వచ్చే వస్తువులు, దుస్తులు వంటివాటిని తాను దైవికమైన వరంగా భావిస్తానని ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
విపాసనతో మనశ్శాంతి
గత పదేళ్లుగా అస్థిరత, యాంగ్జైటీ (ఆందోళన)తో పోరాడుతున్న పాయల్ ఇటీవల ‘విపాసన’ కోర్సు చేశారు. అది తన ఆలోచనలను నియంత్రించుకోవడానికి, ప్రజలను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడానికి సాయపడుతుందని చెప్పారు. ఒకప్పుడు ఒక్క రోజు పని లేకపోయినా సమయం వృథా చేస్తున్నానని బాధపడే పాయల్ ఇప్పుడు నిశ్శబ్దంగా తనతో తాను సమయం గడపడం నేర్చుకున్నారు. ‘‘నేను నా కుటుంబాన్ని పోషించడం కోసమే ఈ పరిశ్రమలోకి వచ్చాను. ఇప్పటికీ దీనికే నా ప్రాధాన్యం’’ అని పాయల్ చెప్పుకొచ్చారు.
అండర్ రేటెడ్ నటిగా మిగిలిపోవాలా?
పాయల్‌ను చాలామంది ఒక ‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తారు. తెలుగు సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదు? అని అడిగే అభిమానులకు ఆమె వద్ద సూటి సమాధానం ఉంది. ‘‘నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. బహుశా నన్ను చూసి ఇండస్ట్రీ జనాలు భయపడుతున్నారేమో’’ అని ఆమె చమత్కరించారు. అయినప్పటికీ సరైన ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తానని, కుదిరితే సరే.. లేదంటే తన దారి తాను వెతుక్కుంటానని ధీమాగా చెప్పారు