ఇది కదా.. రియల్ ఓజీ! దేవ కట్టా చేతిలో.. పవన్ కళ్యాణ్ అస్త్రం!
ABN, Publish Date - Mar 23 , 2026 | 02:54 PM
పొలిటికల్ డ్రామాల స్పెషలిస్ట్ అయిన దేవ కట్టా, పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారనే వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఒకరు.. తెలుగు చిత్ర పరిశ్రమలో పదునైన మాటలతో సమాజంలోని లోపాలను ఎత్తిచూపే దర్శకుడు.. మరొకరు తన మాటతో, చేతతో లక్షలాది మందిని ప్రభావితం చేయగల హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). వీరిద్దరిపై ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. పొలిటికల్ డ్రామాలను వెండితెరపై ఆవిష్కరించడంలో స్పెషలిస్ట్ అయిన దేవ కట్టా (Deva Katta), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
దేవ కట్టా అనగానే మనకు గుర్తొచ్చేవి ఆయన రాసే పదునైన డైలాగులు. ప్రస్థానం సినిమాతో రాజకీయ చదరంగంలోని లోతును చూపించినా, ఆటోనగర్ సూర్యలో వ్యవస్థపై తిరుగుబాటును ఆవిష్కరించినా, రిపబ్లిక్ మూవీతో రాజ్యాంగ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించినా.. అది ఆయనకే సాధ్యం. సమాజం విషయంలో ఆయనకున్న అవగాహన, సమస్యలను విశ్లేషించే తీరు ప్రతి ఒక్కరికీ ఎరుకే. అందుకే ఆయన మాటలకు అంత పవర్ ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసికి కూడా ఆయనే మాటలు అందిస్తుండడం విశేషం.
ఇక అసలు విషయానికి వస్తే.. దేవ కట్టా మార్క్ పొలిటికల్ థ్రిల్లర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా! తాజా సమాచారం ప్రకారం, దేవ కట్టా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఒక లైన్ వినిపించారట. ఈ కథ విన్న పవన్, అందులోని సామాజిక కోణం పట్ల ఎంతో ఇంప్రెస్ అయ్యారని టాక్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆలోచనలు, ఆయన రాజకీయ భావజాలం.. దేవ కట్టా రాసే పవర్ ఫుల్ డైలాగులతో తోడైతే, ఆ సినిమా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, ఒక బలమైన సందేశాన్ని కూడా ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండడంతో దేవకట్టా సినిమా పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోచనల పరంగా ఇద్దరివీ ఒకే ధోరణి కావడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. పవన్ కళ్యాణ్ గ్రేస్, దేవ కట్టా విజన్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే, అది పవన్ కెరీర్ లోనే మరో ప్రస్థానం లాంటి క్లాసిక్ అవుతుందనడంలో సందేహం లేదు.